పొత్తులు పొసగుతాయా? పొద్దు పొడుస్తుందా?

Update: 2018-10-23 09:08 GMT

ఓ వైపు ప్రచారంలో అధికార పార్టీ దూసుకుపోతోంది. వ్యూహాలపై అభ్యర్థులకు అధినేత దిశానిర్దేశం కూడా చేసేశారు. అయినా ప్రతిపక్షాలింకా మేల్కొనలేదు. అధికారం కోసం ఎదురుచూస్తున్న కూటమి పార్టీలు మాత్రం.. పొత్తులపైనే చర్చిస్తూ కూర్చుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాట్లతో తలమునకలవుతున్నాయి. దీంతో విసుగుచెందిన మిగతా పార్టీలు.. వచ్చే రెండు రోజుల్లో సీట్ల సర్దుబాట్లు చేయకపోతే.. తలోదారి చూసుకునేందుకు కూడా మిగతా పార్టీలు సిద్ధమవుతున్నాయి. 

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. మహా కూటమి పొత్తులింకా ఖరారు కాలేదు. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ పార్టీలు.. కలిసి కేసీఆర్‌ ఓటమే లక్ష్యంగా కూటమిగా ఏర్పడ్డా.. సీట్ల సర్దుబాట్లు మాత్రం కత్తిమీద సాములా మారాయి. బలమైన స్థానాలను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదన్న కాంగ్రెస్ పార్టీ.. ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుని.. ముందుకు సాగుదామని నిర్ణయించుకున్నాయి. అయితే మొదటి నుంచి సీట్ల సంఖ్యపై పట్టబడుతున్న తెలంగాణ జనసమితి.. తక్కువ సీట్లు కేటాయిస్తే మాత్రం.. కూటమి నుంచి బయటకు వచ్చేందుకు కూడా సిద్ధమని పరోక్షంగా ప్రకటించింది. 

మరోవైపు తమకు సీట్ల కేటాయింపు కన్నా.. కేసీఆర్‌ ఓటమే లక్ష్యమని.. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ చెప్పుకొచ్చారు. తాము బలంగా ఉన్న చోట్ల మాత్రం తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇక 7 స్థానాలు కావాలంటూ పట్టుబడుతున్న సీపీఐ.. లెక్క తక్కువైతే వేరు దారి చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే బుధవారం లోపు సీట్ల సర్దుబాటు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న చాడ వెంకట్‌రెడ్డి.. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని యోచిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కూటమి కొనసాగుతుందా..? పొత్తులు పొసుగుతాయా..? సీట్ల సర్దుబాట్లు అంత తేలిగ్గా తేలిపోతాయా..? అన్నది వచ్చే రెండు మూడు రోజుల్లో తేలనున్నాయి. 

Similar News