తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది.. అదే నామినేషన్లు, టిక్కెట్ల కేటాయింపు ఘట్టం.. ఇక పార్టీల ముందు మిగిలినది ప్రచార పర్వం.. టిఆరెస్, వర్సెస్ మహాకూటమి మధ్య హోరా హోరీ యుద్ధంగా మారిన ఈ ఎన్నికల పర్వంలో అన్ని పార్టీలు చివరి వరకూ తమ అవకాశాలకు పదును పెట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. ముందస్తు ఎన్నికలకు పిలుపిచ్చి అందరికంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన టిఆరెస్ పార్టీ ప్రచారంలో కూడా అందరికన్నా ఓ అడుగుముందే ఉంది.. సంకల్పానికి తోడు దైవబలం ఉండాలన్న లక్ష్యంతో కేసిఆర్ ఫామ్ హౌస్ లో రెండు రోజులుగా భారీ ఎత్తున శత చండీ యాగాలు, హోమాలు నిర్వహించారు. ఇవాళ పూర్ణాహుతి తర్వాత నేరుగా ఖమ్మం ప్రచారానికి తరలి వెళ్లారు. ఇవాల్టి నుంచి కేసిఆర్ కీలక ప్రసంగాల వేడి పెరిగింది. ప్రత్యర్ధులపై పదునైన పంచ్ లు వేస్తూ.. తమ పార్టీకి ఓటెందుకేయాలో చెబుతూ మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా మాట్లాడారు. అటు మహాకూటమి కూడా సర్దుబాట్లు పూర్తి చేసుకుని పూర్తిస్థాయిలో ప్రచారానికి రంగంలోకి దిగింది. నామినేషన్ల పర్వం ముగిసే వరకూ కూటమి అభ్యర్ధుల్లో తీవ్ర గందరగోళం, సీట్ల సర్దుబాట్లలో అలకలు, ఆగ్రహవేశాలు, అసంతృప్తులు పెల్లుబికాయి. కానీ చివరకు రాహుల్, ఉత్తమ్, చంద్రబాబు, కోదండ రామ్ కలసి కూర్చుని కొన్ని సర్దుబాట్లతో సీట్ల పంపకాలు మమ అనిపించారు. కానీ స్నేహ పూర్వక పోటీల పేరుతో దాదాపు14 సీట్లలో కాంగ్రెస్, టీజేఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. సొంత పార్టీలో వారిని బుజ్జగించి పోటీ నుంచి విరమించేలా చేయడం కాంగ్రెస్ కు తలనొప్పులు తెస్తోంది. ఇక మూడో ప్రత్యర్ధి బిజెపి ఈసారి తన బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెడుతోంది,అందుకే ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా చాలా సైలెంట్ గా తమ అభ్యర్ధుల జాబితాను విడతల వారీగా విడుదల చేసి సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి చేసింది. స్వామీ పరిపూర్ణానంద బిజెపి ప్రచారానికి తురుపు ముక్కగా మారగా, అటు మహాకూటమి అగ్రనేతల రోడ్ షోలకు తోడు తారల తళుకులతోనూ మెరిసిపోతోంది.స్టార్ కాంపెయినర్ రాములమ్మ అప్పుడే ప్రచారం షురూ చేసేయగా, నందమూరి బాలయ్య షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని మహాకూటమి అభ్యర్ధుల తరపున ప్రచారానికి రెడీ అవుతున్నారు. వీరికి తోడు రాహుల్, సోనియా కూడా ప్రచారానికి రానున్నారు.