మహాకూటిమి పొత్తుల మాటెలా ఉన్నా... ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో ముందడుగు వేస్తున్నారు. టికెట్ల ప్రకటన ఎప్పుడు వస్తుందో.. ఎవరికి వస్తుందో అని ఎదురు చూడకుండా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టికెట్లు ఖాయమని భావిస్తున్న సీనియర్ల స్థానాలను పరిశీలిస్తే.. ఆలంపూర్ నుంచి సంపత్‌కుమార్, గద్వాల- డీకే, అరుణ, వనపర్తి- చిన్నారెడ్డి, కోడంగల్- రేవంత్‌రెడ్డి, కల్వకుర్తి వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నాగం జనార్ధన్‌రెడ్డి, జడ్చర్ల- మల్లు రవిలకు టికెట్లు ఖాయం కావడంతో వారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో అలంపుర్, గద్వాల నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించకుండానే ఆయా అభ్యర్థుల ప్రచారాన్ని ఉత్తం, జానా, మల్లు హాజరై ప్రచారాన్ని ప్రారంభించడం విశేషం.
ఇక మిగిలిన మహబూబ్‌నగర్, దేవరకద్ర, షాద్‌నగర్, మక్తల్, నారాయణపేట, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలకు పొత్తులపై అభ్యర్థుల ఎంపిక అవసరమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థుల వేట కొనసాగుతూ ఉంది. ఈ ఏడు నియోజకవర్గాల్లోని అచ్చంపేట, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన జరకపోయినా అక్కడ మాత్రం ఆశావాహులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో నారయణపేట నుంచి టీఆర్‌ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన శివకుమార్‌రెడ్డి ప్రచారం కొనసాగిస్తుండగా.. సరబ్ కృష్ణ కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు. ఐనా శివకుమార్‌రెడ్డి మాత్రం టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇటు దేవరకద్ర నియోజకవర్గంలోనూ టికెట్ ఆశిస్తున్న డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా.. అదే పార్టీ నుంచి న్యాయవాది జి. మధుసూదన్‌రెడ్డి కూడా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక, అసలు టికెట్ కన్ఫాం కాకుండానే ప్రచారాన్ని ప్రారభిస్తున్నారు. మహబూబ్‍నగర్ నియోజకవర్గానికి మాత్రం తీవ్రపోటీ కొనసాగుతుంది. ఇప్పటి దాకా ఇక్కడి నుంచి ప్రచారం ప్రారంభం కాలేదు. టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య నలుగురికి చేరడంతో ఎవరికి టికెట్ కేటాయించాలో అర్థం కాక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇక వనపర్తిలో చిన్నారెడ్డి టికెట్ ఖాయం కావడంతో ఆయన గత రెండు మూడు వారాల నుంచే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా పొత్తులు ఖరారు కాకపోవడం.. ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలోని 14 స్థానాలకు గాను ఎన్ని సీట్లు పొత్తులో ఎగిరిపోతాయి.. ఎన్ని మిగులుతాయో తెలియక కాంగ్రెస్ ఆశావాహులు తలలు పట్టుకుంటున్నారు.