అప్పుడు దండం పెట్టారు.. ఇప్పుడు దండన అంటారు... అర్థం కాని పాలమూరు రాజకీయం

Update: 2018-11-02 10:07 GMT

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొంత మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు, ప్రజల నుంచి తీవ్ర నిరసనలు చవిచూడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారాలకు వెళుతున్న నేతలపై తమ గ్రామానికి ఏం చేశావంటూ ఓట్లు అడగడానికి వచ్చిన అభ్యర్థిని ప్రశ్నిస్తున్నారు జనం. ఎలాంటి అభివృద్ది చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ప్రచారాలకు వచ్చారంటూ... బహిరంగంగానే నిలదీస్తున్నారు. ప్రజలనుంచి నిరసన సెగలను ఎదుర్కొంటున్న అభ్యర్థుల్లో ముందు వరుసలో నిలుస్తున్నాడు...రాష్ట్ర మంత్రి, కొల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు. జూపల్లి ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి, రోజురోజుకు ప్రజల నుంచి నిరసనలు తీవ్రమౌతున్నాయే తప్ప...తగ్గడం లేదు. ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా...ఆ ప్రాంత ప్రజలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు. 20 ఏళ్ళుగా పదవిలో ఉంటూ, ఈ ప్రాంతానికి ఏం న్యాయం చేశారంటూ జూపల్లిని అడుగడుగునా అడ్డుకుని నిలదీస్తున్నారు. దీంతో జూపల్లి కృష్ణారావు కొన్ని చోట్ల సహనం కోల్పోయి..తనను ప్రశ్నిస్తున్న వారిపై తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. దీంతో జూపల్లి ప్రచారం కాస్తా రణరంగంగా మారుతోంది. ఇప్పటికీ ఆయన ఆపద్దర్మ మంత్రిగా కొనసాగుతుండటంతో.. వెంట ఉండే సిబ్బంది.. నిరసన తెలుపుతున్న వారిని చెదరగొడుతున్నారు. 

కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు పరిస్థితి ఇలా ఉంటే...నారాయణపేట టీఆర్ఎస్ అభ్యర్ధి రాజేందర్ రెడ్డికి కూడా ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురౌతున్నాయి. నారాయణపేట నియోజకవర్గంలోని కొయిలకొండ, ధన్వాడ, కోటకొండ గ్రామాల్లో ఆయన ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతను చవిచూశారు. గత రెండు రోజుల క్రితం నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో, కొందరు యువకుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. గెలిచిన తర్వాత తమ గ్రామాన్ని ఏనాడు కూడా పట్టించుకోలేదని నిలదీయంతో... ఒక్కసారిగా సహనం కోల్పోయిన రాజేందర్ రెడ్డి, తీవ్ర పదజాలంతో దూషించడంతో గొడవ మొదలైంది. టీఆర్ఎస్‌ అభ్యర్థులకే కాదు కాంగ్రెస్‌ సిట్టింగ్‍ ఎమ్మెల్యేలకూ, ప్రజల నుంచి ప్రశ్నలపర్వం తప్పడం లేదు. ఆలంపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, తాజామాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు కూడా ప్రజల నుంచి చుక్కెదురైంది. 5 ఏళ్ళు పదవిలో ఉండి, తమ గ్రామాన్ని ఏనాడు పట్టించుకోకుండా...ఇప్పుడు ఓట్లు అడిగేందుకు ఏం ముఖం పెట్టుకుని వచ్చావంటూ, అయిజ మండలం సల్కాపురం గ్రామస్ధులు సంపత్ కుమార్‌ను నిలదీశారు. దీంతో తాము అదికారంలో లేమని, ప్రభుత్వం తమపై వివక్ష చూపుతుందని సంపత్‌ కుమార్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనప్పటికి గ్రామస్తులు తమ నిరసనను వీడలేదు. ఇక చేసేదేమి లేక వెనుదిరగడం సంపత్ కుమార్ వంతైంది.

ఇక కల్వకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‍ రెడ్డికి కూడా ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మాడ్గుల మండలం గుడితాండాలో తమ గ్రామానికి ఏం చేశావంటూ వంశీచంద్‌ రెడ్డిని స్థానికులు నిలదీశారు. గెలిచిన తర్వాత అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చిన మీరు, మళ్ళీ గ్రామానికి రాలేదని, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నావని ఘెరావ్ చేశారు. స్థానికుల ప్రశ్నలవర్షం కొనసాగడంతో వంశీచంద్‌ రెడ్డి, అటు నుంచి అటే వెనుదిరగాల్సి వచ్చింది. ఇవీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయా పార్టీల అభ్యర్ధులకు ఎదరవుతున్న నిరసనలు. హామీలను జనం పట్టించుకోరులే, మర్చిపోతారులే అనుకున్న నాయకులకు, దిమ్మతిరిగేలా షాకిస్తున్నారు ప్రజలు. ఓటర్ల చైతన్యం చూసి, ఆశ్చర్యపోతున్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు.

Similar News