ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బతీయడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. అత్యంత కీలకమైన సీట్ల పంపకంపై ఆచితూచి వ్యవహారిస్తున్నారు. తాము బలంగా ఉన్న స్థానాలను కోల్పోకుండా ... వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కలిసికట్టుగా సాగితేనే కారు జోరుకు బ్రేకులు వేయగలుగుతామని నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్ నేతలు మహా కూటమికి రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న ఈ కూటమిలో ఇప్పటి వరకు తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సిపిఐలు వచ్చి చేరాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలకుండా ఉండేందుకు బీజేపీ, ఎమ్‌ఐఎమ్ మినహా మిగిలిన పార్టీలను కలుపుకోవాలని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు.
మహాకూటమి అవసరాన్ని ఇప్పటికే అధిష్టానానికి వివరించిన కాంగ్రెస్ నేతలు ... కేసీఆర్‌ను ఎదుర్కొవాలంటే ఉమ్మడి వ్యూహాలు అవసరమంటూ నివేదించారు. దీనిపై అధినేత రాహుల్ ... పార్టీ బలంగా ఉన్న స్ధానాల్లో ఖచ్చితంగా పోటీ చేయాలనే షరతు మీద ఆమోదం తెలిపారు. దీంతో సీట్ల సర్దుబాటుపై నేతలు జోరుగా చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు 90 స్ధానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు .. మిగిలిన 29 స్ధానాల్లో ఎవరెవరికి ఎన్ని కేటాయించాలనే దానిపై కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. అటు అధిష్టానంతో పాటు ఇటు పీసీసీ నిర్వహించిన సర్వేల్లో విజయావకాశాలున్న నియోజకవర్గాల్లో కాంగ్రెసే పోటీ చేయాలని నేతలు నిర్ణయించారు. మహాకూటమిలోని టీడీపీ వల్ల గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ నేతలు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే మహాకూటమి చేరేందుకు అంగీకారం తెలిపి ..ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్న టీడీపీ సీట్ల విషయంలో పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. తమకు 20 అసెంబ్లీ సీట్లు కావాలంటూ కోరుతున్న నేతలు .. గ్రేటర్‌తో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు స్దానాలను కోరుతున్నారు.
ఇక ఇప్పటికే కూటమిలో చేరేందుకు అంగీకరించిన సీపీఐ, టీజేఎస్ కూడా సీట్ల విషయంలో రాజీ లేదంటూ ప్రకటలిస్తున్నాయి. ఇందులో సీపీఐ 8 స్ధానాలు
కోరుతుండగా , టీజేఎస్ తాము కోరిన 15 స్ధానాలు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో సీపీఎం ఆధ్వర్యంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తాము కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తి లేదని మరోసారి ప్రకటించింది. జనసేన, ఆమ్‌ఆద్మీ వంటి పార్టీలతో బరిలోకి దిగుతామని కుదరకపోతే ఒంటరి పోరు చేస్తామని ప్రకటించింది. పొత్తుల విషయంలో ఏకతాటిపైకి వచ్చినా సీట్ల పంపకం మహాకూటమిలోని లుకలుకలను బయటపెడుతోంది. సీట్ల విషయం తేలితే తొలి జాబితా ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నా .. ఈప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సాధ్యమయినంత త్వరగా ఈ వ్యవహారాన్ని పరిష్కరించే అగ్రనేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.