వాగ్ధాటితో పరుగులు తీయించిన మాటగాడు

Update: 2018-12-13 14:11 GMT

కేసీఆర్‌ మాటల మరాఠీ తెలంగాణవాదాన్ని గుప్పిట పట్టి ఢిల్లీ పెద్దల గుండెలెదిరించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ధీరోధాత్తుడు. పధ్నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా ఉద్యమాన్ని పండించి సబర్‌ కా ఫల్‌ మీఠా హోతా అని చాటిచెప్పిన మొనగాడు. ముక్కుసూటితనం... చాణక్య చాతుర్యం రాజకీయ వ్యూహం ప్రత్యర్ధిని తికమక పెట్టడం అనర్గళమైన వాగ్ధాటి, తన వాదాన్ని  గట్టిగా సమర్ధించుకునే సత్తా అన్నింటికీ మించి టైమింగ్ ఉన్న పొలిటికల్‌ లీడర్‌ ఇవన్నీ ఆయన్ను విజేతగా నిలిపాయి. మొత్తంగా 2001 నుంచి టీఆర్‌ఎస్‌ ప్రస్థానం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన క్రమం ఓసారి చూద్దాం.

పోరాటాల పురిటి గడ్డపై కేసీఆర్‌ గెలిచి నిలిచిన యోధుడు. తెలంగాణ ప్రజలకి ఆశలా, శ్వాసలా మారిన వీరుడు. బక్క పలచని రూపమైనా.. ప్రత్యర్ధులని తన వాగ్ధాటితో పరుగులు తీయించిన మాటగాడు. ప్రత్యర్ధులను తికమక పెట్టించే వ్యూహనైపుణ్యుడు. వ్యూహానికి తగినట్లుగా, పరిస్థితులకు అనుగుణంగా తన గొంతులో గాంభీర్యాన్ని, వెటకారాన్ని మేళవించి ఎదుటి వారికి చెమటలు పట్టించడటంలో కేసీఆర్‌ని మించిన నాయకుడు సమకాలీన రాజకీయాల్లో కనిపించడు.ఒక వాదానికి తాను ప్రతినిధినని దర్జాగా ప్రకటించుకుని.. పధ్నాలుగేళ్లపాటూ ఆ వాదాన్ని, దాని టెంపోను తగ్గకుండా నిలబెట్టడం సామాన్యులకి సాధ్యమయ్యే పని కాదు. తెలంగాణ వాదానికి ప్రతినిధిగా ప్రకటించుకున్న కేసీఆర్‌ ఆ తర్వాత  అదే వాదానికి అధిపతి అయ్యారు. కరుకైన మాటలు, చురుకైన చమక్కులతో మాటల మరాఠీ అనిపించుకుంటూ సమకాలీన రాజకీయాల్లో తనకు తానే సాటి అంటూ ముందుకు సాగుతున్నారు. 

ఉద్యమ ఊపు, రూపు, పట్టు విడుపులు తెలిసిన వ్యక్తి కాబట్టే తెలంగాణ మహోద్యమాన్ని అలవోకగా లీడ్ చేయగలిగారు కేసిఆర్. ఆయన ఒక్క పిలుపు ఇస్తే.. తెలంగాణ అంతటా ఒక ప్రభంజనంలా తరలివచ్చింది. ష్ ..గప్‌చుప్ అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ పాటించింది. ఉద్యమంపై తిరుగులేని పట్టు సాధించిన వారికి మాత్రమే ఆ కమాండింగ్ సాధ్యమవుతుంది. వాస్తవానికి తెలంగాణ గడ్డపై ఎందరో పోరాట వీరులున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యమం నడుస్తోంది. కానీ కేసిఆర్ ఒక్కడికే అది సాధ్యపడింది. ఎప్పుడూ ఒక రకమైన ఉద్రేక పూరిత వాతావరణాన్ని సృష్టించడం, మండే గాయంపై వెన్న రాయడం కేసిఆర్ యుద్ధ వ్యూహాలు. అందుకే ఆయన చివరకు గమ్యాన్ని ముద్దాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.
 

Similar News