కారు పార్టీలో ప్రయాణానికి కాంగ్రెస్ నేతలు పరుగులు పెడుతుంటే .. టికెట్ల కోసం పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ తరపున బరిలోకి దిగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు, నలుగురు నేతలు సిద్ధం కావడంతో తీవ్ర స్ధాయిలో పోటీ నెలకొంది. అధికార టీఆర్ఎస్ నేతలకు తోడు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు సీటు తమదంటే తమదేనంటూ చెప్పుకుంటున్నారు.
ముందస్తు ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమైందనే వార్తలతో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ముఖ్య నేతలు తమ పర్యటనలతో కార్యకర్తల్లో జోష్ నింపుతుంటే టికెట్ల కోసం నాయకులు కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారు. సిట్టింగ్‌లకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పోటీనిస్తుంటే ప్రతిపక్ష సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట ఆశావాహులు సీటు తమదంటే తమదేనని చెప్పుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్‌లో ఇప్పటికే రామ్మోహన్ గౌడ్ పని చేసుకుంటూ ఉండగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజాగా ఎంటరయ్యారు. 2019 ఎన్నికల నాటికి బలపడే వ్యూహంతో స్థానికంగా పెళ్ళిల్లు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ ఓడిపోయిన జైపాల్ యాదవ్ తో పాటు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈ మధ్యే టీఆర్ఎస్ లో చేరిన ఎడ్మ కిష్టారెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేసుకుంటున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి నియోజకవర్గం నాగార్జున సాగర్ లో మూడు స్తంభాలాట జరుగుతోంది. నోముల నర్సింహ్మాయ్య, తేరా చిన్నప రెడ్డితో పాటు ఎన్ ఆర్ ఐ రవీందర్ రెడ్డిలు ఎవరికి వారు టికెట్ తమదేనని ధీమాలో ఉన్నారు.
మిర్యాల గూడలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన భాస్కర్ రావుతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ ఎస్ అభ్యర్థి అమరేందర్ రెడ్డి ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇద్దరు నేతలు ఎవరికి వారు మీటింగ్ లు పెట్టి నియోజకవర్గంలో హీట్ పుట్టిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హూజూర్ నగర్ లో గత ఎన్నికల్లో పోటీ చేసిన శంకరమ్మతో పాటు ఎన్ ఆర్ ఐ సైది రెడ్డి పోటా పోటీగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
మంత్రి చందూలాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో కుమారుడు ప్రహ్లాద్ యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. అయితే మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ కూడా వచ్చే సారి ఇక్కడినుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య రసవత్తర రాజకీయం నడుస్తోంది.కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని మాజీ మంత్రి బస్వరాజు సారయ్యతో పాటు ఎర్రబెల్లి ప్రదీప్ రావు భావిస్తున్నారు. ఖమ్మం అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కు పోటీగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పొంగులేటి భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నేతల మధ్య తీవ్ర స్దాయిలో ఉన్న పోటీ ఎటు దారితీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయమే ఫైనలంటూ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి వ్యూహంతో 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ నమ్మకంగా చెబుతున్నారు.