స్త్రీలు-పురుషులు ఇద్దరూ సమానమే కానీ. పురుషులు కాస్త ఎక్కువ సమానమని, సినిమాలో ఓ డైలాగ్ ఉంది. కానీ తెలంగాణలో దాదాపు 50 నియోజకవర్గాల్లో, పురుషుల కంటే మహిళల కాస్త ఎక్కువ సమానమని, ఏకంగా ఎన్నికల కమిషన్ తేల్చింది. తెలంగాణలోని అత్యధిక నియోజకవర్గాల్లో, మహిళా ఓటర్లే అధికం. ఈ విషయం చెబుతున్నది సాక్షాత్తు ఎన్నికల కమిషన్. మొత్తం ఓటర్ల డేటా విశ్లేషించిన ఈసీ, రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల్లో పురుషుల కంటే, మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని లెక్క తేల్చేసింది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంగా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ రికార్డుకెక్కింది. అక్కడ 15,388 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్ రూరల్, నిర్మల్, ఆర్మూర్ ఆ తరువాతి ప్లేసెస్‌లో నిలిచాయి.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అత్యధిక ఓటర్లు మహిళలే. ఉత్తర తెలంగాణలోని 10
నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే 5 వేలకు పైబడి అధికంగా ఉందని లెక్కకట్టింది ఈసీ. ఇటీవల ఈసీ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 57 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండగా, లేటెస్ట్ లిస్టులో అది 50 స్థానాలకే పరిమితమైంది. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోని మగవారు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు పెద్దఎత్తున వెళ్తుంటారు. కరీంనగర్ కొత్త జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా...వాటిలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్‌లో మహిళా ఓటర్లే అధికం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నందుకే, అన్నీ పార్టీలూ వారికి వరాలు ప్రకటించడంలో పోటీపడుతున్నాయి.
తుది జాబితాలోనూ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా శేరిలింగంపల్లి నిలవగా, భద్రాచలం చివరి స్థానంలో ఉంది. శేరిలింగంపల్లిలో 5,49,773 మంది ఓటర్లు ఉండగా, భద్రాచలంలో 1,33,756 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,663 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరిలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 158 మంది ఉన్నారు.