చాలామంది అభ్యర్థులు మీఇంటికొచ్చి, మీ గడపతొక్కి, మిమ్మల్ని ఓట్లు అడుగుతారు. మీ వీధికిది చేస్తాం, మీ ఊరిని బాగు చేస్తామంటారు. కొండమీది కోతినైనా తెస్తామని, రకరకాల హామీలిచ్చి అష్టవంకర్లు తిరుగుతారు ఓట్ల కోసం. కానీ ఎన్నికలై, గెలిచిన తర్వాత షరామామూలుగా ఒట్టు తీసి గట్టునపెట్టి, వాగ్ధానాలన్నీ మర్చిపోతారు. అసలు మీ ఊరివైపు చూడరు. ప్రతి ఐదేళ్లకోసారి ప్రతి ఓటరుకూ ఇది అనుభవమే. మరి అలా హామీలను మర్చిపోయే నేతలను ఏం చెయ్యాలి....ఏం చెయ్యాలో, ఎలా నిగ్గదీసి, సిగ్గు తీయాలో ఓ అభ్యర్థి, స్వయంగా చెప్పుకుంటున్నాడు. అతని వినూత్న ప్రచారం, అన్ని పత్రికల్లోనూ పతాకశీర్షికలెక్కింది. ఇదేంటి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలా వినూత్న ప్రచారం చేస్తున్నాడని అనకుంటున్నారా...కాదు..
రాజీనామా పత్రాలు, చెప్పులు చేతపట్టుకొని నడుస్తున్న ఈ అభ్యర్థి పేరు ఆకుల హన్మండ్లు. కోరుట్ల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి. ఇంటింటికీ తిరుగుతూ, తనకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నాడు ఇంతకీ రాజీనామా పత్రాలు, చెప్పుల సంగతేంటనే కదా మీరు ఆలోచిస్తున్నారు....ఒక్కసారి అతని మాటల్లోనే వినండి...రాజీనామా పత్రం, చెప్పుల కథేంటో చెబుతున్నాడు.ఇచ్చిన హామీలు మర్చిపోతే చెప్పుతో కొట్టాలని ఓటర్లకు పిలుపు. రాజీనామా పత్రాన్ని అసెంబ్లీకి పంపాలని ఓటర్లకు నివేదన. వాగ్దానాలను తుంగలో తొక్కే నేతలకు ఇలాంటి తెగువ ఉందా?-హన్మాండ్లు
విన్నారుగా, ఎన్నికల్లో గెలిచి, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, చెప్పుతో కొట్టండి...రాజీనామా పత్రాన్ని అసెంబ్లీలో ఇచ్చి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండని, జనాలకు చెబుతున్నాడు. డిఫరెంట్ కదా. ప్రజలు కాస్త నవ్వుకుంటున్నప్పటికీ, ఎన్నికలైన తర్వాత ఓటర్లను బోడి మల్లయ్యలుగా చూసే నేతలున్న కాలంలో, ఇలా డేరింగ్ డాషింగ్‌గా చెప్పుతో కొట్టండి, ఎమ్మెల్యే పదవి నుంచి దించేయండని, ఇతను పిలుపునివ్వడం, ఆశ్చర్యపరుస్తోందంటున్నారు. వాగ్దానాలను మర్చిపోతున్న నేటి కాలంలో, ఇలాంటి తెగువ ఏ అభ్యర్థికి ఉందని ప్రశ్నిస్తున్నాడు ఆకుల హన్మాండ్లు.
ప్రతి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో, పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తుంటాయి. ఒక్కో ఊరుకు వాగ్దానాలూ ఇస్తుంటాయి. నోటికి ఏదొస్తే అదే చెప్పి, ఓటర్లకు గాలమేస్తుంటారు అభ్యర్థులు. పార్టీల మేనిఫెస్టోలు-అమలుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని, వాటిని నెరవేర్చకపోతే సదరు అభ్యర్థిని రీకాల్ చేయాలని, కొందరు ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేయడంపై, కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. కానీ ఏ చర్యాలేదు. చట్టమూ లేదు. కోర్టుల్లోనూ వీటిపై తేలడం లేదు. నిజంగా హామీలను మర్చిపోయే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే, అవకాశం ఓటర్లకు దక్కాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అదే విషయాన్ని వివరిస్తున్నాడు హన్మాండ్లు.
పార్టీలు, అభ్యర్థుల వాగ్దానాలపై జనంలో చైతన్యం పెరుగుతోంది. సోషల్ మీడయా విప్లవంతో అన్ని హామీలూ గుర్తుంటున్నాయి జనాలకు. కొన్నిచోట్ల వాగ్దానాలకు బాండ్ పేపర్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు జనాలు. ఆకుల హన్మండ్లు చెప్పినట్టు, చెప్పుతో కొట్టకపోయినా, సదరు అభ్యర్థిని రీకాల్ చేసే ఛాన్స్ ఓటర్లకు ఉండాలి. ఓటర్లలో ఇలాంటి చైతన్యం ఉన్నప్పుడే, ఒళ్లు దగ్గరపెట్టుకుని అభ్యర్థులు హామీలిస్తారు. ఆచరణ సాధ్యమయ్యే ప్రామిస్‌లే చేస్తారు.