ఉత్తర తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. వరంగల్ జిల్లాలో రాజకీయం రంగులు మారుతుంది. కొండా ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో... కారు జోరు తగ్గుతుందా? హస్తరేఖలు మారుతాయా? ఉద్యమానికి ఊపిరిలూదిన కాకతీయుల కోటలో... గులాబీ తోట గుభాళిస్తుందంటోంది టీఆర్ఎస్. మరి ఓరుగల్లు రాజకీయ చిత్రంలో ఎవరి పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులుపెట్టిన కాకతీయుల కోటలో పాగా వేస్తామని ఏ పార్టీకి ఆ పార్టీయే చెబుతోంది. 2014లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న గులాబీదళం... ఈసారి అదే హవా కొనసాగిస్తామని చెబుతుంది. ఇదే సమయంలో కొండా దంపతులు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడంతో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ కూడా రెండు పార్టీల కార్యకర్తల్లో కనిపిస్తుంది.
కొండా సురేఖ, మురళీ దంపతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. కొండా సురేఖ ఎంపీటీసీ నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగిన మహిళా నేత. శాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు ఇలా ఎక్కడ పోటీ చేసినా.. గెలుపు ఖాయం. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా సురేఖ వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఈసారి టిక్కెట్ రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
కొండ దంపతుల రాకతో వరంగల్ రాజకీయం మారుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొండా దంపతులకు పట్టున్న మూడు నియోజకవర్గాల్లో హస్తం పాగా వేయడం ఖాయమంటున్నారు. అయితే కొండా దంపతుల రాకతో పెద్ద వచ్చే ముప్పు ఏమీ ఉండదంటోంది గులాబీదళం. ఇంకా చెప్పాలంటే ఆ ప్రభావమే కనిపించదని చెబుతున్నారు. ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల్లో తీర్పు ఎలా ఉంటుందోనని ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తి కనబరుస్తున్నారు.