ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు.. ప్రలోభ నేతలకు జనగామ జిల్లా కోమళ్ల వాసి వినూత్న ప్రచారం
ఓటే వజ్రాయుధం. ప్రజాస్వామ్య బ్రహ్మాస్త్రం. దేశ తలరాతను మార్చే పాశుపతాస్త్రం. అలాంటి పవర్‌ఫుల్ వెపన్ అయిన ఓటును కొనేందుకు కొందరు అభ్యర్థులు ప్రయత్నిస్తే, మరికొందరు ఓటర్లు అమ్ముకుంటున్నారని ఎన్నో నివేదికలు, నిదర్శనాలున్నాయి. ఇలాంటి ప్రలోభాలు, ఓట్ల కొనడాలు, అమ్ముకోవడాలు చూసి, విసిగి వేసారింది ఓ కుటుంబం. వినూత్న ప్రయత్నం చేసింది. ప్రతిఒక్కరిలోనూ చైతన్యం నింపుతోంది. ఇంతకీ ప్రలోభాలపై ఆ కుటుంబం చేసిన ప్రయత్నమేంటి? అలాంటి డైలమాలు, కన్ఫ్యూజన్‌లకు ఆస్కారం లేకుండా జనగామ జిల్లా కోమళ్ల వాసి ఓ వినూత్న ప్రచారానికి తెరలేపాడు. తన గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాసి చాలా మంది రాజకీయ నాయకుల వక్రబుద్ధికి ఆయిల్ రాస్తున్నాడు.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి తన ఇంటి గోడపై ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు అని రాయించాడు. దీంతో పాటు నా జాతి ప్రజలకు కత్తి చేతికివ్వలేదు ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను పోరాడి రాజులౌతారో అమ్ముడుపోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది అన్న అంబేద్కర్ మాటలను కూడా కింద రాయించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓటర్లను ఆకర్షించి, మభ్యపెట్టేవారికి ఈ వాల్ రైటింగ్ చెంపపెట్టులాంటిదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వినూత్న ప్రచారం గ్రామస్తులు, యువతను, సోషల్ మీడియాలో పలువురిని అమితంగా ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తోంది.