తండ్రి కోసం తనయ... ఇందూరు సభ ఏర్పాట్లు పూర్తి

Update: 2018-10-02 10:21 GMT

టీఆర్ఎస్ బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లా ముస్తాబయ్యింది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో ఉన్న గులాబీ దళపతి మరోసారి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. హుస్నాబాద్ సభతో ఎన్నికల ప్రచార శంఖాన్ని పూరించిన కేసీఆర్.. విరామం అనంతరం ఉమ్మడి జిల్లాల వారిగా భారీ బహిరంగ సభలకు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి పూర్తిస్ధాయి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తండ్రి సభకు కూతురు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి భారీ జనసమీకరణపై దృష్టి పెట్టారు ఎంపీ కవిత.

నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల వేదికగా.. టీఆర్ఎస్ పార్టీ మలి దశ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఉమ్మడి జిల్లాల వారిగా చేపట్టే వరుస బహిరంగ సభలు.. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రారంభం కానుండటంతో.. జిల్లా కేంద్రంలో జరిగే సభుపై  భారీ అంచనాలున్నాయి. టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లు ఎంపీ కవిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో మకాం వేసిన కవిత.. ఉమ్మడి జిల్లాలోని తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,  పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ.. సభను సక్సెస్ చేసేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభకు.. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సభా స్ధలి వద్దే హెలిప్యాడ్‌ను సిద్దం చేశారు. వేదిక, ఇతర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జిల్లాలోని 9 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. అధినేత దృష్టిని ఆకర్షించేలా.. కొందరు తాజా మాజీలు జనసమీకరణలో పోటీ పడుతున్నారు. వాహనాలను గ్రామాల్లో సిద్ధ చేశారు. సభను విజయవంతం చేసేందుకు గులాబీ నేతలు చమటోడుస్తున్నారు. 

గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 100 మంది నేతలు వేదికపై కూర్చునేలా నిర్మాణం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చే నేతలతో పాటు జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలు కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. హుస్నాబాద్ సభ అనంతరం పూర్దిస్ధాయి ప్రచారం నిజామాబాద్ నుంచి ప్రారంభించే కేసీఆర్.. పార్టీ అధినేత హోదాలో సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాస్దాయి సభ నిజామాబాద్ నుంచి ప్రారంభం కానుండటంతో.. ఈ సభ విజయవంతం చేసి జిల్లా సత్తా మరోసారి చాటాలని నేతలు ఊవ్విళ్లూరుతున్నారు. తాజా మాజీలు సైతం సీఎం సభపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 
 

Similar News