కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. మాటల తూటాలు పేల్చడంలో దిట్ట. ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధించడంలో తిరుగులేని వక్త. దేన్నయినా వివాదంగా మలిచి, చర్చనీయాంశంగా చేసే వ్యూహకర్త. ఎలాంటి పరిస్థితులలైనా, తనకు అనుకూలంగా మలచుకోగల నేర్పరి. రోజుల తరబడి సైలెంట్‌గా ఉన్నా, ఒక్కసారి మైక్ అందుకున్నాడంటే గడగడలాడించే గండరగండడు ఈ గులాబీ దళాధిపతి. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే టీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకైక నినాదం కేసీఆర్. గులాబీ పార్టీ తిరుగులేని ఆయుధం కేసీఆర్. కేవలం కేసీఆర్ పేరు చెప్పి ఓట్లు అడుగుతామని టీఆర్ఎస్ నేతలు సైతం ప్రకటించారు. అదే కేసీఆర్‌ను చూసి జనం జేజేలు కొట్టారు.
నిజంగా టీఆర్ఎస్ బలం, బలగం కేసీఆరే. తనకున్న సానుకూలాంశాలను బేరీజు వేసుకునే, కాన్ఫిడెన్స్‌తో ముందస్తుకు సై అన్నారు గులాబీ బాస్. కేసీఆర్ వర్సెస్ ఎవరక్కడా అన్నట్టుగా సాగిన సమరంలో, గులాబీ బాస్‌కే పట్టం కట్టారు జనం. ముందస్తుకు సిద్దమని ప్రకటించి, అసెంబ్లీని రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించేసి, సంచలనం సృష్టించారు కేసీఆర్. అంతేవేగంగా ప్రజా ఆశీర్వాదం పేరుతో బహిరంగ సభలు మొదలుపెట్టి శంఖారావం పూరించారు. అసలు ప్రత్యర్థుల ఊహకందకుండా, జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లారు. ప్రజాకూటమికి అందనంత దూరంలో కారును పరుగులు పెట్టించారు. వరుసగా మూడు సభలను పెట్టిన తర్వాత కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ కూటమి ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అందుకే ముందే అన్ని నియోజవర్గాలను చుట్టేసి, ఎనర్జీ వేస్ట్ చేయడం ఎందుకని మౌనందాల్చారు. సైలెంట్‌గా ఉండి, ప్రత్యర్థుల వ్యూహాలను స్టడీ చేశారు. గందరగోళం మధ్య కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, తిరిగి రీఎంట్రీ ఇచ్చి చెలరేగిపోయారు కేసీఆర్.
ఒకవైపు ప్రజాకూటమి అడపాదడాపా సభలు పెడుతూ, నెమ్మదిగా వెళ్తుంటే, కేసీఆర్ దుమ్మురేపుకుంటూ దూసుకెళ్లారు. ఆ వయస్సులో కూడా రోజుకు 5 నుంచి 9 సభలు నిర్వహిస్తూ, అనర్గళంగా ప్రసంగిస్తూ నియోజకవర్గాలను చుట్టేశారు. 119వ నియోజకవర్గంగా తన గజ్వేల్‌లో ప్రచారం చేశారు. కేసీఆర్ సభలకు జనం భారీగా తరలివచ్చారు. అప్పటి వరకూ గెలుపుపై పెద్దగా నమ్మకంలేని అభ్యర్థులంతా, కేసీఆర్ రాకతో ధైర్యం తెచ్చుకున్నారు. యుద్ధంలో కత్తులు తిప్పుతున్న వీరుడికి, బ్రహ్మాస్త్రం దొరికినట్టు, కేసీఆర్‌కు చంద్రబాబు అనే ఆయుధం దొరికింది. ఏ అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో బాగా తెలిసిన కేసీఆర్, చంద్రబాబును విలన్‌గా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. పక్క రాష్ట్రం సీఎంకు ఇక్కడేం పని అని నినదించారు. బాబు రాకతో సెంటిమెంట్‌ను రగిలించారు. కీలు బొమ్మ సర్కారు కోసం బాబు, వందల కోట్లు కాంగ్రెస్‌కు ఇచ్చాడని ఆరోపించారు. బాబు రూపంలో అందివచ్చిన ఆయుధాన్ని, సరిగ్గా గురిచూసి కొట్టారు కేసీఆర్. ప్రత్యర్థుల ఊహకందని వ్యూహాల్లో తానే దిట్టని నిరూపించుకున్నారు.
మొదటి నుంచి సంక్షేమ పథకాలపై తిరుగులేని సంతకం కేసీఆర్‌ది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు బంధు, ఆసరా వంటి దాదాపు 40 సంక్షేమ పథకాలకుపైగా అమలవుతున్నాయి. ఈ స్కీముల లబ్దిదారులు 2 కోట్లమంది. అంటే, ప్రతి వ్యక్తికి నెలకు 2166 లబ్ది చేకూరుతోంది. కుటుంబంలో నలుగురు ఉంటే, ప్రతి ఫ్యామిలికీ, నెలకు అందుతున్న మొత్తం 8664 రూపాయలు. ఏడాదికి లక్షా మూడు వేల 968 రూపాయలు. ఈ లబ్దిదారులందరూ కేసీఆర్ పట్ల ఎనలేని కృతజ్తత చూపారు. సంక్షేమ పథకాలే తనను విజయతీరాలకు చేరుస్తాయని గట్టిన నమ్మిన నాయకుడు కేసీఆర్. మేనిఫెస్టోలో మరిన్ని హామీలిచ్చి, మరింత మందికి దగ్గరయ్యారు. వీటిని ప్రచారం చేయడంలో కేసీఆర్ చురుగ్గా వ్యవహరించారు. కేసీఆర్ మాటే మంత్రం. నిజంగా జనంలో మంత్రంలా పని చేసింది. ఉద్యమ తీవ్రతతో కాకుండా, సింపుల్‌గా మాట్లాడారు కేసీఆర్. జనం భాషలో మాట్లాడుతూ, వారికర్థమయ్యే రీతిలో సంభాషించారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ చేసింది, ప్రజాకూటమి వస్తే రాష్ట్రం ఏమవుతుందన్న యాంగిల్‌లో ప్రసంగించారు. కరెంటు, సంక్షేమ పథకాలు, అభివృద్ది ఆగిపోతాయని మాట్లాడారు. జనంలో ఈ మాటలు బాగా ప్రభావం చూపాయనడానికి, చరిత్ర సృష్టించేలా వెల్లడైన ఫలితాలే నిదర్శనం.
ప్రజాకూటమి ఉద్దండ నాయకులను చక్రబంధం చేయడంలో, కేసీఆర్ వ్యూహం పక్కాగా పని చేసింది. జానారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వంటి నాయకులను టార్గెట్ చేసుకున్నారు. పకడ్బందీగా వారి నియోజకవర్గాల్లో స్ట్రాటజీలు అమలు చేశారు. అసలు వాళ్లు, తమ నియోజకవర్గాలను వదిలివెళ్లకుండా చక్రబంధం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ధైర్యంగా ముందస్తుకు వెళ్లిన కేసీఆర్, అంతా తానై వ్యవహరించారు. అభ్యర్థుల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కేవలం తన ముఖం చూసి, ఓటెయ్యాలని అభ్యర్థించారు. కేసీఆర్ మాటలు, చేతలను నమ్మిన జనం, వీర తిలకం దిద్దారు. కేసీఆర్ తప్ప తమకేం అవసరం లేదని ఏకపక్షంగా తీర్పిచ్చారు. మరి జనం కట్టబెట్టిన ఈ అఖండ విజయోత్సాహంతో, ఈ ఐదేళ్లు కేసీఆర్ ఎలా పాలిస్తారోనని, అదే జనం ఆశగా ఎదురుచూస్తున్నారు.