నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభ వేదికగా.. గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేశారు. సిగ్గులేకుండా తెలంగాణను నాశనం చేసినవారితోనే.. కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రవాళ్లకు అధికారం అప్పగిస్తారని ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ మరోసారి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడికి పదును పెట్టి.. ఎన్నికల ప్రచారంలో హీట్ రాజేశారు. తెలంగాణను నాశనం చేసినవాళ్లతో పొత్తు పెట్టుకోవడం కన్నా.. తనను అడిగితే, నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లమన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలను.. తెలంగాణ ప్రజలు నమ్మోద్దన్నారు కేసీఆర్.
చంద్రబాబుతో పొత్తు కలుస్తారా! థూ..మీ బతుకులు చెడ అని కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ఇవొక బతుకులా! ఎవడైతే తెలంగాణను నాశనం చేశాడో, గుండు కొట్టిండో.. చంద్రబాబుతో పొత్తా? మీ బతుకులకు. అడుక్కుంటే నేను ఇస్తాను.. నాలుగు సీట్లు. ఇదా మీ బతుకు! దయచేసి, తెలంగాణ మేథావులకు, పెద్దలకు నేను మనవి చేస్తున్నా.. మళ్లీ ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా అధికారం? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకెట్టు పెడతారా? కాంగ్రెస్ పార్టీ వాళ్లు పరాన్న భుక్కులు.. వీళ్ల చేతుల్లో ఏమీ ఉండదు అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న సొల్లు పురాణాలు, పిచ్చికూతలు టీ-కాంగ్రెస్ నేతలు కూస్తున్నారని మండిపడ్డారు.