తెలంగాణ ఎన్నికల సమరంలో అసలుసిసలు యుద్ధానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. యాగాల తర్వాత యోగం కలిసి వస్తుందన్న నమ్మకంతో ఖమ్మం నుంచి ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రచారక్షేత్రాన్ని పరుగులుపెట్టించారు. మహాకూటమి, చంద్రబాబు లక్ష్యంగా కేసీఆర్ నిప్పులు చెరిగారు. విపక్షాలపై విమర్శల ఆయుధాలను ప్రయోగించి... అస్త్రాలకు పదునుపెట్టారు.
కేసీఆర్ అనర్గళ ప్రసంగాలు, దెప్పిపొడవులు, చెణుకులు, తిట్లు, శాపనార్థాలు...ఇవి కేవలం మాటలు కాదు, కేసీఆర్ అమ్ముల పొదిలో పదునైన ఆయుధాలు. ఎన్నికల ప్రచారంలో కేవలం తన నోరు ఆయుధంగా ప్రయోగించిన కేసీఆర్... ఖమ్మం నుంచి ప్రచారభేరికి శంఖం పూరించారు. విపక్షాలను తిట్టినతిట్టు తిట్టకుండా, గుక్కతిప్పుకోలేనంతగా విరుచుకుపడ్డారు. తాను చేస్తున్న విమర్శలకు, విపక్షాలు కేవలం ఆన్సరిచ్చుకునేలా, ఆత్మరక్షణలోకి నెట్టేసిన గులాబీ బాస్... తన వ్యూహాన్ని సమరశంఖం ద్వారా పక్కాగా అమలు చేశారు.
గులాబీ దళాధిపతి మొదటి అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్‌ను సంధించారు. 2014 ఎన్నికల తరహాలోనే తెలంగాణ అనుకూల, వ్యతిరేక విభజనవాదాన్ని, వినిపించారు. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టి కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆంధ్రా పార్టీ అయిన టీడీపీతో ఎలా పొత్తుపెట్టుకుంటారని, కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేంద్రానికి చంద్రబాబు ఎన్నో లేఖలు రాశారని, మరి అలాంటి చంద్రబాబుతో భుజంభుజం ఎలా కలుపుతారని, హస్తం పార్టీపై విల్లు ఎక్కుపెట్టారు. టీడీపీ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. మౌనంగా ఉంటే మీ గొంతును మీరు పిసుక్కున్నట్టేనంటూ తనదైన శైలిలో చెప్పారు కేసీఆర్.
ఇప్పటికే అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని, గట్టిగా విశ్వసిస్తున్నారు కేసీఆర్. అందుకు లెక్క పక్కాగా వేసుకున్నారు. కేవలం వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్యను పరిగణలోకి తీసుకున్నా, తమ పార్టీ విజయం సునాయాసమని దీమాగా ఉన్నారు. ఇదే ఆయుధాన్ని ప్రయోగించారు... సంక్షేమ పథకాల అమలును సవివరంగా వివరించి ప్రజల్లోకి తీసుకెళ్లారు కేసీఆర్. ఇక పెన్షన్‌లు రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతితో పాటు అనేక కొత్త పథకాలు తమను గట్టెక్కిస్తాయని నమ్మిన కేసీఆర్... రానున్న సభల్లో ఇవే స్కీములను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వీటికి తోడు వివిధ సామాజికవర్గాలతో వరుస సమావేశాలు, వారికి భవన్‌లు, ప్రత్యేక నిధులు, స్కీమ్‌లను అనౌన్స్ చేస్తూ, సోషల్ ఇంజినీరింగ్‌ను కూడా సమర్థంగా ఇంప్లిమెంట్ చెయ్యాలనుకుంటున్నారు కేసీఆర్.
మొత్తంగా స్థానికంగా కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను చెరిపేయడానికి, తనపైనే మొత్తం ఎన్నికలు ఫోకస్ అయ్యేలా ప్లాన్ చేశారు కేసీఆర్. ఈ ఎన్నికలు కేవలం రెఫరెండంగా మార్చుకుంటూ తనను చూసి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు.