శాసనసభ విజయంతో, మాంచి ఊపుమీదున్న గులాబీ దళాధిపతి, ఇక హస్తిన సామ్రాజ్యంపై దండెత్తుందుకే సకల అస్త్రాలూ సిద్దం చేసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు దీటుగా మరో ఫ్రంట్ పెట్టేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి, ఫెడరల్ ప్రంట్ ప్రయత్నాలు స్పీడప్ చెయ్యాలనుకుంటున్నారు. అయితే ఇప్పటికే యూపీఏ, ఎన్డీయే కూటములున్నాయి. అందులోనూ వివిధ పార్టీలున్నాయి. మరి కేసీఆర్ పిలుపందుకుని, ఫెడరల్ ఫ్రంట్‌లో చేరేదెవరు కేసీఆర్ గురిపెట్టిన ఆ ప్రాంతీయ పార్టీలేవి?
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో ఊపు మీదున్న కేసీఆర్, ఫలితాలు విడుదలైన రోజే, తన తదుపరి టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలలేని చెప్పేశారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వమే తన లక్ష్యమని ప్రకటించారు. ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పతానని చెప్పకనే చెప్పారు. టీఆర్ఎస్ విజయోత్సవ వేడి ఏమాత్రం చల్లారకుండా, కేటీఆర్‌ను రంగంలోకి దింపారు కేసీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్తాయిలో పార్టీ బలోపేతం చెయ్యాలని కర్తవ్యం నూరిపోశారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న కేటీఆర్, 17 ఎంపీ స్థానాల్లో 16 టీఆర్‌ఎస్‌కు కట్టబెడితే, ఢిల్లీని శాసిస్తామని చెబుతున్నారు. శాసన సభ ఎన్నికల మాదిరే, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టి, గులాబీకి వీరతిలకం దిద్దాలని పిలుపునిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్, కేటీఆర్ మాటలను బట్టి, పార్లమెంట్ ఎన్నికలే తదుపరి లక్ష్యంగా టీఆర్ఎస్ పెట్టుకుందని క్లియర్‌గా అర్థమవుతోంది. అంతేకాదు ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు మరింత ఊపునివ్వాలని డిసైడయ్యారు కేసీఆర్. ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.
అయితే, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో ఏయే పార్టీలుంటాయన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పటికే ఎన్డీయేతో కొన్ని పార్టీలున్నాయి. శివసేన, అకాలీదల్ కాస్త ఆగ్రహంగా ఉన్నా, చివరికి బీజేపీతోనే ఉండే ఛాన్సుంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ, కాంగ్రెస్ గొడుగు కిందకు చేర్చేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. ఐదు రాష్ట్రాల రిజల్ట్స్ వెల్లడికి ఒకరోజు ముందు, అంటే డిసెంబర్ పదో తేదీన ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏకమై, ఐక్యతను చాటుకున్నాయి. పార్లమెంట్ అనెక్స్ హాల్‌లో జరిగిన మహాకూటమి సమావేశానికి దాదాపు 25 పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకాలేదు. ఒడిషా అధికార పార్టీ బిజూ జనతాదల్ కూడా అటెండ్ కాలేదు. మమత వచ్చినా ఆగ్రహంగానే ఉన్నారు. కేసీఆర్ తాజా పర్యటన షెడ్యూల్‌లో, వీరినే కలుసువబోతుండటం, ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈనెల 24న ఒడిషాలో పర్యటిస్తారు కేసీఆర్. బిజూ జనతాదల్ అధినాయకుడు, సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమవుతారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి సమానదూరం పాటిస్తున్నారు పట్నాయక్. పార్లమెంట్‌లో అనేక బిల్లులకు బీజేపీకి మద్దతిచ్చినా, వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో తనకు బీజేపీ నుంచే గట్టి పోటీ ఉందని భావిస్తున్న పట్నాయక్, కాషాయంతో కేర్‌ఫుల్‌గానే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలను దూరంగా పెడుతున్నందుకే నవీన్ పట్నాయక్‌తో మాట్లాడబోతున్నారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్‌తో, ఢిల్లీ రాజకీయాలను శాసిద్దామని, ఆయనకు పిలుపునివ్వబోతున్నారు. పట్నాయక్‌ను కలిసిన తర్వాత, కోల్‌కతాకు వెళ్లి, మమతా బెనర్జీని కలుస్తారు కేసీఆర్. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా మమత వ్యతిరేకిస్తున్నారు. అటు బెంగాల్‌లో చొచ్చుకువస్తున్న బీజేపీతోనూ ఆమె వెళ్లలేరు. కాంగ్రెస్‌తో భీకర శత్రుత్వం లేకపోయినా, ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న దీదీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తెచ్చుకుని, ఢిల్లీ పీఠం అధీష్టించాలనుకుంటున్నారు. ఇవే పరిణామాలు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు ఊపునిస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్‌లో మరింత క్రియాశీలకం కావాలని మమతను కోరే ఛాన్సుంది.
ఇక కోల్‌కతా పర్యటన తర్వాత రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు కేసీఆర్. అక్కడే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలుస్తారు. చెన్నైలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా సమర్థిస్తూ, డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన ప్రకటనపై మాయావతి, అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని దాదాపుగా వ్యతిరేకించినట్టు మాట్లాడారు. ఢిల్లీ పీఠాన్ని శాసించే యూపీలో, ఎస్పీ, బీఎస్పీలతో పాటు పలు చిన్న పార్టీలు జతకట్టి మహా ఘట్‌బంధన్ పేరుతో పోటీ చేయాలనుకుంటున్నాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూటమిలోనూ ఎస్పీ, బీఎస్పీల్లేవు. ఇవే కామన్ పాయింట్స్ కేసీఆర్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో మాయావతి, అఖిలేష్‌లతో సమావేశమై, ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని పిలుపునివ్వొచ్చు కేసీఆర్. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వైసీపీ అధినేత జగన్, అధికారికంగా ఏ ఫ్రంట్‌లోనూ లేరు. ఎన్నికల టైంలో ఏపీలో పర్యటిస్తానంటున్న కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్‌లో కలవాల్సిందిగా జగన్‌ను కోరతారేమో చూడాలి.
మొత్తానికి కేసీఆర్ ప్రయత్నమంతా ప్రాంతీయ పార్టీల సత్తా చాటడం. 2019లో ఢిల్లీ పీఠాన్ని శాసించేది ప్రాంతీయ పక్షాలేనని ఆయన దీమా. ఒకవైపు కాంగ్రెస్ బలహీనడపడుతుండటం, మరోవైపు బీజేపీకి దక్షిణాదిలో పట్టులేకపోవడం, ఉత్తరాదిలో సీట్లు కోల్పోయే అవకాశంతో, ఇక ప్రాంతీయ పార్టీలే, హస్తన రాజకీయాల్లో చక్రంతిప్పుతాయన్నది గులాబీ బాస్ లెక్క. ఆ లెక్కతోనే బీజేపీయేతర, కాంగ్రెసేత ప్రభుత్వం స్థాపనపై మాట్లాడుతున్నారు. సరికొత్త పాలన, ఆర్థిక విధానలతో దేశాభివృద్దిని పరుగులు పెట్టించాలనుకుంటున్నారు. మరి నిజంగానే 2019ని ప్రాంతీయ పార్టీలు శాసించబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు కోల్పోతుంది. కాంగ్రెస్‌కు దక్కేవెన్ని రెండు జాతీయ పార్టీలకు మిన్నగా ప్రాంతీయ పార్టీలు ఎన్ని స్థానాలు కొల్లగొడతాయి?