ఒకటి కాదు రెండు. రెండు కాదు.. మూడు. మూడు కాదు... ఇప్పుడు ఐదు. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ గులాబీ బాస్ దూకుడు మరింత పెంచేస్తున్నారు. అపోజిషన్ అలయన్సే లక్ష్యంగా అణ్వస్త్రాల్లాంటి మాటల తూటాలు పేలుస్తున్నారు. మహాకూటమి టార్గెట్‌గా మాటల మంటలు రేపుతున్నారు. జనంలో కూటమిని కూల్చడమో, కుళ్లబొడవడమో, ధ్యేయంగా గులాబీ దళాధిపతి వాగ్భాణాలు సంధిస్తున్నారు హుస్నాబాద్, నిజామాబాద్ సభల తర్వాత గ్యాప్ తీసుకున్న కేసీఆర్ సుడిగాలి సభళతో మహాకూటమిపై యుద్ధం ప్రకటించారు.
మహాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లపై పదునైన తూటాలు పేల్చారు కేసీఆర్. కూటమిని కుల్లబొడిచేలా గులాబీ దళాధిపతి అణ్వస్త్రాల్లాంటి బాంబులేశారు. కూటమి గోడలను కూలగొట్టడమే లక్ష్యంగా, ప్రజాశీర్వాద సభల్లో చెలరేగిపోయారు. కూటమి పార్టీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణను నాశనం చేసిన వ్యక్తితో జట్టుకట్టారని, సిగ్గులేకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారా అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి ప్రశ్నించారు.తెలంగాణలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు కేసీఆర్. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న దుర్మార్గులకు ఏ శిక్ష వేయాలో ప్రజలే ఆలోచించాలన్నారు. రైతుబంధు చెక్కులు ఆపాలని కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసు వేశారని విమర్శించారు. ఎన్నికలనగానే కాంగ్రెస్ నేతలు ఆగమాగం అవుతున్నారని అన్నారు కేసీఆర్.
హుస్నాబాద్, నిజామాబాద్ సభతో ఎన్నికల శంఖారావం పూరించి కాస్త విరామం తీసుకున్న కేసీఆర్, ఏకంగా ఐదు ప్రజాశీర్వాద సభలతో ఎన్నికల వేడిని అమాంతం పెంచేశారు. ఆ హీట్ పుట్టించారు. కూటములు కడుతున్న పార్టీలను ఏకిపారేశారు. మహాకూటమిని జనంలో పలుచన చేరేందుకు, సెంటిమెంట్ అస్త్రాన్ని రగిలించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన కాంగ్రెస్, తెలంగాణ అభివృద్దిని అడ్డుకున్న టీడీపీ, రెండూ జట్టుకట్టడమేంటని విమర్శించారు.
మళ్లీ అధికారం ఆంధ్రోళ్లకు అప్పగిస్తారా? తెలంగాణ కోసం ఇంత మంది చచ్చిపోయింది ఇందుకేనా? చావు దగ్గరకుపోయి తెలంగాణ తెచ్చింది ఇందుకేనా?. అమరావతికి తెలంగాణను తాకట్టు పెడతారా? ఢిల్లీ కాంగ్రెస్‌కు గులాం అవుతారా అంటూ తెలంగాణ ప్రజల మదిలో సరికొత్త సెంటిమెంట్‌ను రగిలించారు. మొత్తానికి ప్రజాశీర్వాద సభల సాక్షిగా, ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మహాకూటమి టార్గెట్‌గా గులాబీ దళాధిపతి అస్త్రాలు సంధించారు. కూటమి నేతలు కూడా మాటల యుద్ధంలో కత్తులు దూస్తున్నారు. మున్ముందు డైలాగ్ వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో, సభల ద్వారా రెచ్చిపోయి చూపించారు.