కామెంట్ల కాక వెనుక కథ... కేసీఆర్‌ స్పీచ్‌ డీకోడ్‌ చేస్తే...!!

Update: 2018-10-06 08:26 GMT

మూడు సభలు. రెండు టార్గెట్‌లు. సభకు సభకూ పదును తేలిన మాట. ఎక్కడ కొడితే, ఎవరిని కొడితే, ఎలా తూటాలు పేల్చితే, సెన్సేషన్‌ అవుతుందో అలానే గురిపెట్టారు. నిజామాబాద్‌, నల్గొండ, వనపర్తిలో కేసీఆర్‌ ప్రసంగాన్ని డీకోడ్‌ చేస్తే తేలేదేంటి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. మాటల తూటాలు పేల్చడంలో దిట్ట. ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధించడంలో తిరుగులేని వక్త. దేన్నయినా వివాదంగా మలిచి, చర్చనీయాంశంగా చేసే వ్యూహకర్త. ఎలాంటి పరిస్థితులలైనా, తనకు అనుకూలంగా మలచుకోగల నేర్పరి. రోజుల తరబడి సైలెంట్‌గా ఉన్నా, ఒక్కసారి మైక్‌ అందుకున్నాడంటే గడగడలాడించే గండరగండడు. వరుసగా మూడు సభల్లోనూ, వాడీవేడీ మాటలతో మంటలు రేపారు గులాబీ దళాధిపతి.

హుస్నాబాద్‌‌ ప్రజాశీర్వాద సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. వినాయక నిమజ్జనం కారణంగా, కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత నిజామాబాద్‌ సభతో ప్రచార హోరును తిరిగి ప్రారంభించి, నిప్పులు కురిపించారు. నిజామాబాద్‌ సభా వేదికను మాటలతో దడదడలాడించారు గులాబీ బాస్. ఉద్యమంలో మాట్లాడిన తీవ్రమైన భాషనే వాడారు. ఒకవైపు నాలుగున్నరేళ్ల తన పాలనతో చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులను వివరిస్తూనే, అంతకుమించి ప్రత్యర్థులను మాటలతో కుళ్లబొడవడంపై ప్రధానంగా దృష్టిపెట్టారు. కేసీఆర్‌ మొత్తం ప్రసంగంలో రెండే రెండు టార్గెట్‌లు కనిపిస్తాయి. అందులో మొదటిది, మహాకూటమి రూపంలో చంద్రబాబును ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం.

ఇక నల్గొండ సభలో, చంద్రబాబుపై మాటల తీవ్రత పెంచారు కేసీఆర్. తాను మూడో కన్ను తెరిస్తే, నీ సంగతేంటని ఏపీ సీఎంను హెచ్చరించారు.
బైట్...కేసీఆర్, నల్గొండలో బాబు మీద మాట్లాడింది. ఇక వనపర్తిలో అయితే, చంద్రబాబుపై ఉగ్ర స్వరంతో చెలరేగిపోయారు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో దొరికింది నువ్వు కాదా అని తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ రెండో టార్గెట్, కాంగ్రెస్. మహాకూటమికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌‌ను, అదే అస్త్రంగా దెబ్బకొట్టాలని గులాబీ బాస్‌ డిసైడైనట్టు, ఆ‍యన ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. మహాకూటమా...గూటమా అంటూ చెలరేగిపోయారు. ఆంధ్రా పార్టీ, చంద్రబాబు కుయుక్తుల పార్టీతో ఎలా జతకడతారని, తూటాలు పేల్చారు కేసీఆర్. ఢిల్లీకి, హస్తినకు గులాములు అవుతారా ఫైర్‌ అయ్యారు. స్థానిక కాంగ్రెస్‌ నేతల పేర్లు ప్రస్తావిస్తూనే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై పదేపదే విమర్శల జడివాన కురిపించారు. నిజామాబాద్‌, నల్గొండ, వనపర్తిలో స్థానిక కాంగ్రెస్‌ ప్రముఖులపై ఎవరూ ఊహించనిరీతిలో వాగ్భాణాలు సంధించారు గులాబీ బాస్.

ఇలా కేసీఆర్ మూడు సభల్లోనూ, చంద్రబాబును మెయిన్‌ టార్గెట్‌ చేసుకుని, కాంగ్రెస్‌ను సెకండ్‌ టార్గెట్‌గా విమర్శల జడివాన కురిపించారు. ఇంతకుముందులా, వ్యంగ్యాస్త్రాల కంటే, ఈసారి కుళ్లబొడిచే తిట్లకే ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఒక సీఎంను పట్టుకుని, బట్టేబాజ్‌ అనొచ్చా అంటూ, జనాన్ని ప్రశ్నించి, గుజరాత్‌ సభలో మోడీలా, సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. చంద్రబాబును ప్రధాన లక్ష్యం చేసుకోవడంలో, కేసీఆర్‌ లెక్క పక్కాగా ఉంది. మహాకూటమిలో కాంగ్రెస్‌ సహా మిగతా పార్టీల్లో ఎవరూ చంద్రబాబు అంతటి నాయకుడు లేరు. బాబును బూచిలా చూపి, మహాకూటమిపై జనంలో అభద్రతా భావం రేకెత్తించడం, కేసీఆర్‌ ప్రధాన ఉద్దేశం. 

ఎందుకంటే, చంద్రబాబు ఏపీ సీఎం. ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ ఉంది. దీంతో ఒకవేళ తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే, ఆంధ్రా ప్రయోజనాలే నెరవేరుతాయని, తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని, జనంలోకి బలంగా తీసుకెళ్లాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఒక్క చంద్రబాబును టార్గెట్‌ చేసుకోవడం ద్వారా, మొత్తం మహాకూటమి ఉనికిపైనే దెబ్బకొట్టాలని గులాబీ బాస్‌ ఇంటెన్షన్. అందుకే చంద్రబాబుపై, రకరకాల మాటలతో డైలాగ్‌ వార్. ప్రతి మాటా చర్చనీయాంశమయ్యేందుకు, ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. సామాన్య ప్రజలు సైతం చెవులప్పగించి వినేలా మసాలా లాంటి మాటలు కుమ్మరించారు. మున్ముందు కేసీఆర్‌, ప్రజాశీర్వాద సభల్లో ఎలాంటి కామెంట్లు చేసి, కాక రేపుతారో చూడాలి.

Similar News