నాలుగున్నరేళ్లు సీఎంగా పనిచేస్తున్న కేసీఆర్‌కు ఎంత ఆస్తి ఉంటుంది..? స్థిరాస్తులు ఎన్ని..? చరాస్తులు ఎన్ని..? కేసీఆర్ అప్పులు కూడా చేశారా..? ఆయనకు అప్పులు ఇచ్చిన వారు ఎవరు..? ఆయన ఎవరెవరి వద్ద ఎన్నెన్ని అప్పులు చేశారు..? కేసీఆర్ తాజా అఫిడవిట్ తో ఇలాంటి సమాచారం బయటకు వచ్చింది. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన నామినేషన్‌లో తన ఆస్తులు, అప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ అఫిడవిట్‌లో పొందుపర్చారు. కేసీఆర్ సమర్పిచిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ.22కోట్ల 60లక్షల 77వేల 946రూపాయిలు కాగా, వీటిలో చరాస్తులు 10కోట్ల 40లక్షల 77వేల 946. పొలం, ఇల్లు, ఫామ్‌హౌస్ లాంటి స్థిరాస్తులు 12 కోట్ల 20లక్షలుగా పేర్కొన్నారు. ఇక కేసీఆర్ వద్ద నగదు రూపంలో 2 లక్షల 40వేలు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు 5కోట్ల 63లక్షల 73వేల 946 ఉన్నాయని.. తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్‌లో షేర్ల విలువ 55లక్షలని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్ల విలువ 4కోట్ల 16లక్షల 25వేలు. కేసీఆర్ వద్ద ఉన్న బంగారం 75 గ్రాములు, దాని విలువ రూ.2లక్షల 40వేలు. కేసీఆర్ భార్య శోభ పేరు మీద మొత్తం 94లక్షల 59వేల 779 ఆస్తులు ఉన్నాయి. అందులో బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఇతర రాళ్ల విలువే అధికం. కేసీఆర్ మొత్తం అప్పులు రూ.8కోట్ల 88లక్షల 47వేల 570. అందులో కొడుకు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ 82లక్షల 82వేల 570రూపాయిలు. కోడలు శైలిమ వద్ద కూడా కేసీఆర్ అప్పు చేశారు. ఆమెకు 24లక్షల 65వేలు బకాయి ఉన్నారు. కేసీఆర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏడాదికి 99వేల ఇన్సూరెన్స్ కడుతున్నారు. కేసీఆర్ మీద మొత్తం 64 కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ఎక్కువగా ఉన్నాయి.