కరీంనగర్‌ కోటలో మూడు పార్టీల గెలుపు తంత్రం

Update: 2018-10-22 05:14 GMT

రాజకీయ ప్రముఖులకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా. అలాంటి జిల్లాలో నిత్యం రసవత్తరంగానే సాగుతున్నాయి పాలిటిక్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాజకీయాల్లో శిఖరాగ్రాలను తాకినవారు కొందరైతే.....ఉన్నత పదువులు అందుకుని రాష్ట స్దాయి నేతలుగా కొనసాగుతున్నవారు ఇంకొందరు. జనరేషన్స్ మారినా కరీంనగర్‌లో రాజకీయ వేడి మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎన్నికల సమరానికి, సమయం దగ్గరపడేకొద్దీ అనేక మలుపులు తిరుగుతున్నాయి కరీంనగర్‌ రాజకీయాలు. ఉత్కంఠగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం చొప్పదండి ఒక్కటి. తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతిసారి ఈ నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ఇంకా ఖరారు చేయలేదు. అయినా ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు, ఎవరికివారు పోటాపోటిగా ప్రచారం చేసుకుంటున్నారు. 

టీఆర్ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభతో పాటు, అదే పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్, ఇద్దరూ టికెట్ ఆశిస్తు ప్రచారానికి కూడా దిగారు. దీంతో ఇక్కడ ప్రత్యర్ది పార్టీల హడావుడి కన్నా, సొంత పార్టీలోని ఇద్దరు వ్యక్తుల ప్రచారం ఎక్కువగా ఉండటంతో చివరికి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగిపోయింది. మరోవైపు ఈ ఇద్దరికీ మద్దతుగా ఉన్న నాయకుల్లో, భార్యలు బొడిగె శోభ వైపు, భర్తలు సుంకె రవిశంకర్ వైపు ఉండటంతో మరింతగా ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీంతో ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారో అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక జిల్లా కేంద్రం కరీంనగర్‌లో మరో పరిస్దితి. ఈ నియోజకవర్గంలో పోటీ మొన్నటి వరకు బిజేపి.,టీఆర్ఎస్‌ మధ్య ఉంటుందని భావించారు. గత ఎన్నికలు, ప్రస్తుత పరిస్దితుల కారణంగా అంతా అయితే టీఆర్ఎస్‌ లేదంటే బిజేపి అనే భావనలోనే కొన్ని రోజులు ఉన్నారు. అయితే సడన్‌గా తెరమీదకి కాంగ్రెస్ అభ్యర్దిగా పొన్నం ప్రభాకర్ పేరు ప్రచారంలోకి రావడంతో పోటి కాస్త త్రిముఖంగా మారింది. తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్‌ నుంచి పొన్నం ప్రభాకర్‌, ముగ్గురు కూడా మంచి పేరున్న నాయకులే కావడంతో పోటీ ఉత్కంఠ పెంచుతోంది.

కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా కేంద్రంలోను పరిస్దితి ఇలానే ఉంది. రాజకీయాల్లో కురువృద్దుడైన మాజీ మంత్రి జీవన్ రెడ్డితో, పోరాడి ఓడిన టీఆర్ఎస్‌ అభ్యర్థి సంజయ్ ఈసారి కూడా పోటిలో ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జగిత్యాలలో ఇప్పటికే తన వ్యూహాలకు పదును పెడుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఉన్న జీవన్ రెడ్డి ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. అయినా కూడా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి, సంజయ్ గట్టిపోటి ఇస్తారని నియోజవర్గంలోని ప్రజలు అనుకుంటున్నారు. మరోవైపు మహాకూటమితో పాత ప్రత్యర్దులైన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ జీవన్ రెడ్డిలు ఇప్పుడు మిత్రులయ్యారు. దీంతో రమణ ఓట్ బ్యాంక్ జీవన్ రెడ్డికి ప్లస్ అవుతుందంటు ప్రచారం జరుగుతోంది. కాని సంజయ్‌ను ఎట్టిపరిస్దితుల్లోనూ గెలిపించుకునేందుకు ఎంపీ కవిత పట్టుదలగా ఉన్నారు. మూడు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తుండటంతో, జగిత్యాలలో పోటీ రసవత్తరంగా మారింది.

Similar News