తూర్పు గోదావరిలో కాకరేపుతున్న కాపు సెగ...జగన్ పై కాపు నేతల తిరుగుబాటు

Update: 2018-07-31 06:18 GMT


పార్టీలకి ఈ ప్రాంతం చాలా కీలకం ఇక్కడ గెలిస్తే పవర్ గ్యారంటీ అన్న నమ్మకం కూడా ఉంది. అందుకే తూర్పు గోదావరి అంటే పార్టీలు ఎలర్ట్ అవుతాయి ఇక్కడ ప్రచారమంతా ఒక ఎత్తు రాష్ట్ర మొత్తం ప్రచారమంతా ఒక ఎత్తు 2019 ఎన్నికలకు పునాదిగా మారిన గత ఎన్నికల రాజకీయాన్ని ఒకసారి చూడండి.

 ఏపీ రాజకీయాలకు కొత్త ఊపుని, ఉత్సాహాన్ని తెచ్చేవి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు. రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగిందంటే చాలు నేతలు బోణీ కొట్టేది గోదావరి జిల్లాల ప్రచారం తోనే తూర్పు గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన పార్టీ అధికారం దక్కించుకుంటుదన్నది నానుడి..2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం మెజారిటీ స్థానాలు గెల్చుకుంది. ఇందులో టిడిపి గెలుచుకున్నవి 12 కాగా మరోసీటు మిత్రపక్షం బిజెపి గెలుచుకుంది.. ఇండిపెండెంట్ గా గెలిచిన పిఠాపురం ఎమ్మెల్యే ఎ.వి.వి.ఎస్. వర్మ టిడిపికి మద్దతు ప్రకటించడంతో టిడిపి బలం14కు చేరింది. ఇక వైసిపి ఇక్కడ గెలుచుకున్నవి 5 స్థానాలు.. అయితే తదనంతర పరిణామాల్లో ముగ్గురు టిడిపిలోకి మారిపోయారు. పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జగ్గం పేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇద్దరూ ఒకేసారి టిడిపిలోకి జంప్ అయిపోయారు.. వీరిద్దరికీ బంధుత్వం కూడా ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా వైసిపికి గుడ్ బై కొట్టి టిడిపిలోకి మారిపోయారు. దీంతో జగన్ పార్టీ బలం రెండు సీట్లకు పడిపోయింది. ఇక ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. వైసిపికి ఈ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్సీలుండగా, వైసిపి నుంచి గెలిచిన ఆదిరెడ్డి అప్పారావు ఆ తర్వాత  మళ్లీ సొంత గూడైన టిడిపిలోకి మారిపోయారు. దాంతో ప్రస్తుతం ఒకే ఒక్క ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్  వైసీపిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

విభజన తెచ్చిన వాతావరణం ఏపిలో రాజకీయాలనూ కుదుపు కుదిపింది. పవన్ కల్యాణ్ ను ఒకవైపు, మోడీ గ్రాఫ్ ను మరోవైపు పెట్టుకుని ఈ ఎన్నికల్లో టిడిపి సునాయాసంగా గెలుపొందింది. ఈ గెలుపు ప్రభావంతోనే పార్టీ ఫిరాయింపులూ తూర్పు గోదావరి రాజకీయ చిత్రాన్ని మార్చేశాయి.

తూర్పు గోదావరి జిల్లాల్లో తెలుగు దేశం మెజారిటీ సీట్లు గెలుచుకోడానికి మూల కారణం మిత్రపక్షాల సహకారమేనన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఉమ్మడి రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదన్నది ఆంధ్ర ప్రజల మనోభావం. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా విభజించిందన్న అక్కసుతో కాంగ్రెస్ ను ఓడించాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. అదేసమయంలో టిడిపికి బిజెపి, పవర్ స్టార్ చెరో చేయి అందించారు. ఈ మూడు పార్టీలు కలసిపోటీ  చేయడం, కాంగ్రెస్ ను జనం పరిగణనలోకే తీసుకోకపోవడంతో ప్రతిపక్షాల నుంచి బరిలోనిలిచిన వ్యక్తిగా జగన్ ఒక్కడే మిగిలారు. విభజనపై కోపంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు వైసిపి పంచన చేరగా మరికొందరు కాంగ్రెస్ లో ఉంటూనే లోపాయికారిగా వైసిపీకి మద్దతు పలికారు.. అధికారం దక్కించుకోడానికి ఈజిల్లా సీట్లే కీలకం కావడంతో చంద్రబాబు  అత్యంత జాగ్రత్తగా వ్యూహం రచించారు. అప్పటికింకా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాని పవన్ కల్యాణ్ ను ప్రత్యేకించి తూర్పు గోదావరి పర్యటనకు వినియోగించారు.. ఈ జిల్లాలో ఎక్కువ సభల్లో పవన్ మాట్లాడేలా ప్లాన్ చేశారు. రాజమండ్రి, కాకినాడలలో పవన్ ఎన్నికల ప్రచార సభలు అభిమానులతో కిక్కిరిసి పోయాయి. దాంతో పవన్ అభిమానులంతా తెలుగుదేశానికి అండగా నిలిచారు. అప్పటి వరకూ తెలుగుదేశం-వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నరీతిలో తటస్థ ఓటర్లంతా మరో ఆలోచన లేకుండా టిడిపికి ఓటు వేశారు.

దీంతో 12 అసెంబ్లీ స్థానాలను టిడిపి నేరుగా గెలవగా, రాజమండ్రి సిటీలో బిజేపీ గెలుపుతో తెలుగుదేశం-బిజేపీ కూటమి 13 స్థానాలు దక్కించుకుంది. దీంతో తూర్పుగోదావరిలో మెజారిటీ స్థానాలు టిడిపి పరమయ్యాయి. దీనికి తోడు పిఠాపురం నుంచి తెలుగుదేశం రెబల్ గా పోటీచేసిన వర్మకూడా చివరకు టిడిపికే మద్దతు తెలిపారు. దాంతో మొత్తం 14 స్థానాలు టిడిపి పరమయ్యాయి. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ముగ్గురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి పంచన చేరడంతో టిడిపి బలం 17 సీట్లకు పెరిగింది. వైసిపికి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాశెట్టిరాజా, చిర్ల జగ్గిరెడ్డి తుని, కొత్త పేట స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారు.

దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టిడిపి కి 2014 ఎన్నికలు చావో రేవో లాంటి ఎన్నికలు అందుకే చంద్రబాబు మీకోసం వస్తున్నా అంటూ పాదయాత్ర చేశారు. విభజనతో దెబ్బ తిన్న ఏపిని అభివృద్ధి పథంలో నడిపించడానికి సమర్ధుడైన నాయకుడు అవసరమనుకున్న ఓటర్లు చంద్రబాబుకు పట్టం కట్టారు మరోవైపు గెలుపు కోసం టిడిపి అమలు సాధ్యం కాని వాగ్దానాలు కూడా చేసేసిందన్నది ఒక విమర్శ.

2014 ఎన్నికల్లో టిడిపికి విజయం అంత సునాయాసంగా రాలేదు పరిస్థితుల ప్రభావం కొంత మిత్రపక్షాల అండ కొంత అన్నీ కలసి గెలుపును సాకారం చేశాయి. జిల్లాలో జగన్ గెలుపు ఖాయమని అనుకుంటున్న తరుణంలో పవన్ కల్యాణ్ ప్రచారం, దేశవ్యాప్తంగా మోడీకి పెరిగిన గ్రాఫ్, బిజెపిపై ప్రజలకున్న కొత్త ఆశలు అన్నీ కలిపి టిడిపి కూటమి గెలుపుకి కారణమయ్యాయి. దీనికి తోడు విభజన తర్వాత కుదేలైన కాంగ్రెస్ వైసిపికి ఎలాంటి మద్దతు ప్రకటించకపోవడం కూడా తెలుగు దేశం గెలుపుకి కారణాలుగా చెప్పొచ్చు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతలుగా వుంటూ, వైఎస్ సన్నిహితులు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, జివి హర్షకుమార్ లు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన సమైక్యాంధ్రపార్టీకి మద్దతుగా నిలిచారు. హర్షకుమార్ సమైక్యాంధ్ర తరపున పోటీకి దిగినా ప్రయోజనం కన్పించలేదు. వీరిద్దరూ వైసీపీ నేత జగన్ కు మద్దతు పలికి ఉంటే, లేదా జగన్ వారి మద్దతు కోసం ప్రయత్నం చేసినా వైసీపీ పరిస్థితి నాటి ఎన్నికల్లో మరో విధంగా వుండేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఇవేకాదు టిడిపి గెలుపుకి మరికొన్ని కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది కాంగ్రెస్ రాష్ట్రాన్ని  అడ్డగోలుగా విభజించడం ఈ దెబ్బకి కాంగ్రెస్ పునాదులతో సహా కూలిపోయింది. అదే టైమ్ లో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు గెలుపు కోసం వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపట్టడం ఒక కారణమైతే ఆ యాత్ర సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు మరో కారణం రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు పదివేల వరకూ రుణ మాఫీ హమీకి మహిళల నుంచి బాగా స్పందన వచ్చింది. వీటికి తోడు తూర్పు గోదావరిలో ఎక్కువగా ఉన్న కాపు ఓట్లను ప్రభావితం చేసేలా  కాపు రిజర్వేషన్ల అస్త్రాన్ని  టిడిపి ప్రయోగించింది. దీనికి తోడు పవన్ మద్దతు జత కలిసింది. కాపులను బిసీల్లో చేరుస్తామన్న హామీ బ్రహ్మాస్త్రంలా పని చేసింది. వీటన్నింటితో పాటు జిల్లాలో బలమైన పార్టీ కేడర్ తెలుగు దేశానికి వుండటం, జిల్లా రాజకీయాలను ఓ వైపు యనమల రామకృష్ణుడు, మరో వైపు నిమ్మకాయల చినరాజప్ప సమర్ధవంతగా నాయకత్వాన్ని నడపడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది. 

తూర్పు గోదావరి రాజకీయం ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతోంది. దాదాపు 40రోజులు జిల్లా అంతా కలియతిరుగుతున్న జగన్ ప్రభుత్వ అవినీతి, అమలు కాని వాగ్దానాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు  టిడిపి సీనియర్లు సైతం ఎన్నికల నాటికి పార్టీ బలపడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో టిడిపికి బలమైన కేడర్ ఉంది. సిఎం చంద్రబాబు తర్వాత  స్థానంలో ఆర్థిక మంత్రి యనమల, మరో వైపు డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప వున్నారు. వీరిద్దరూ తూర్పు గోదావరి జిల్లా పార్టీని క్రియాశీలకంగా నడిపించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి మెజారిటీ స్థానాలు సాధించే దిశగా పావులు కదుపుతున్నారు. అయితే జిల్లాలో ప్రస్తుతం వున్న ఎమ్మెల్యేలలో కనీసం ఐదు లేదా ఆరుమంది ఎమ్మెల్యేల సీట్లను మార్చాల్సివుంటుందనే చర్చ ఆ పార్టీ వర్గాలలో చర్చజరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల తీరుపై ప్రజలలో వ్యతిరేకత వుందన్న విషయం గుర్తించిన తెలుగుదేశం పార్టీ పొరపాట్లును సరిదిద్దుకునే ప్రయత్నాల్లో పడింది. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు తూర్పు గోదావరి జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు చేరువకావాలని చూస్తున్నారు. కాకినాడలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షతో చంద్రబాబు ప్రజలు తనతోనే వున్నారనే సంకేతమివ్వాలనే ప్రయత్నం చేశారు. 

మరోవైపు వైసిపి అధినేత జగన్ ఈ జిల్లాపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టారు నియోజక వర్గాల వారీగా సమస్యలపై మాట్లాడుతూ నేతల పనితీరును విమర్శిస్తూ జగన్ పాదయాత్ర సాగింది. దాదాపు 40రోజులు ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన జగన్ చంద్రబాబు హామీల అమలు లో వైఫల్యాన్ని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు రాజమండ్రి నగరంలోకి జగన్ ఎంట్రీయే అత్యద్భుతంగా సాగింది. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై జగన్ తో పాటు వైసిపి కార్యకర్తల కవాతు వైఎస్  పాదయాత్ర నాటి ఆదరణను మించిపోయింది. టిడిపి నేతల అవినీతి, ఇసుక మాఫియా, నీరు- చెట్టు అక్రమాలు ఇలా అవినీతి ఆరోపణలను జగన్ ఏకి పారేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల పనితీరును, వారిపై రేగుతున్న అవినీతి ఆరోపణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. 2014లో టిడిపి, వైసీపీలకు మధ్య ఓట్ల తేడా 5లక్షలు మాత్రమే మోసపూరిత వాగ్దానాలివ్వకపోవడమే తన ఓటమికి కారణమని జగన్ చెబుతున్నారు. రైతు రుణ మాఫీ, కాపురిజర్వేషన్ అంశాలు ఆచరణ సాధ్యం కాదు కాబట్టి జగన్ వాటిని తన మేనిఫెస్టోలో ప్రస్తావించలేదు కానీ చంద్రబాబు వాటిని మేనిఫెస్టోలో పెట్టారు  కానీ అమలు చేయలేదనే విమర్శలున్నాయి.

తూర్పు గోదావరిజిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ కాపు రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదంటూ తేల్చేయడం కలకలం రేపింది. మొన్నటి వరకూ మద్దతిచ్చి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటారా అంటూ కాపులు మండిపడుతుంటే అమలు కాని వాగ్దానాలను చేయడం తన చరిత్రలోనే లేదంటున్నారు జగన్.

తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతోంది ఓపక్క టిడిపి ధర్మ పోరాట దీక్షలు, మరోవైపుజగన్ పాదయాత్ర వీరిద్దరికీ మించి పవన్ గోదావరి జిల్లాల పర్యటనతో ప్రస్తుతం తూర్పుగోదావరి లో రాజకీయ వేడి కనిపిస్తోంది. ఇదే జిల్లా పర్యటనలో ఉన్న జగన్ ను కాపురిజర్వేషన్ల అంశం తాకింది కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదు కాబట్టే జగన్ తన గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు అదేవిషయాన్ని పదే పదే జగన్ చెబుతూ వచ్చారు మరోవైపు ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన టిడిపి ఆ తర్వాత దానిపై మిన్నకుండి పోయింది. దాని ఫలితమే గతంలో కాపుల తిరుగుబాటు అది కాస్తా ఉద్రిక్తంగా మారి తుని దగ్గర రత్నాచల్ రైలు దగ్ధానికి కారణమైంది.  దాంతో స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై మంజునాథ కమిషన్ వేసింది. కాపు ఉద్యమం మరింత హీటెక్కుతుండటంతో ఆ కమిషన్ నివేదిక రాకుండానే అసెంబ్లీలో తీర్మానం చేసి  కేంద్రం కోర్టులోకి నెట్టేసి చేతులు దులిపేసుకుంది. ఇదే అంశాన్ని వైసిపి ప్రధానంగా ప్రస్తావించింది. అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకపోవడం ఎందుకంటూ దుమ్మెత్తిపోసింది. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ ఉద్యమానికి వైసిపి గతంలో పరోక్షంగా మద్దతు ఇచ్చింది. కాపులను బిసీల నుంచి తొలగించడం అన్యాయమంటూ గతంలో జగన్ కూడా మాట్లాడారు అయితే కాపు రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని మొదట్నుంచి జగన్ క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న టైమ్ లో తూర్పు గోదావరి పాదయాత్రలో ఉన్న జగన్ కాపురిజర్వేషన్లు సాధ్యంకాదని తేల్చేశారు కాకపోతే తాము అధికారంలోకి వస్తే కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ ఫండ్ ను రెట్టింపు చేస్తామని వాగ్దానమిచ్చారు. జగన్ మాటలపై కాపులు భగ్గుమన్నారు.

మరోవైపు జగన్ వ్యాఖ్యలపై వైసిపి నేత కురసాల కన్న బాబు వివరణ ఇచ్చారు, మరోవైపు డిఫెన్స్ లో పడ్డ వైసిపిపై విమర్శలజోరు పెంచింది టిడిపి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి పర్యటనకొస్తే ఈవివాదం మళ్ళీ హీటెక్కే ఆస్కారం కనిపిస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీం కోర్టు రూలింగ్ ఉండగా కాపు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ పార్టీలు ఆశలు పెట్టడం రాజకీయమేనని విశ్లేషకులు అంటున్నారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న వారిని బిజెపితొత్తులుగానూ, వారితో లాలూచీ పడిన వారిగానూ అభివర్ణిస్తూ జిల్లాలో నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో తూర్పు గోదావరి జిల్లా రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది.

మోడీతో గొడవపడటం ఇష్టం లేకనే జగన్ ప్లేటు తిప్పేశారంటున్నాయి విపక్షాలు మరోవైపు జగనే తమ ప్రత్యర్ధిగా భావిస్తున్న కాంగ్రెస్ కూడా తామొస్తే కాపులకు రిజర్వేషన్ తెస్తామంటోంది. ఎవరెమన్నా రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పే తుది తీర్పు కాబట్టి... జగన్ చేసిన ప్రకటన సరైనదేనంటున్నారు విశ్లేషకులు. 

Similar News