ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కొనసాగే అవకాశాలున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి టి. ఆచారికి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మధ్య జరిగిన హోరాహోరి పోరులో 78 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాడు. ఈసారి మాత్రం ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. ఎందుకంటే, టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కూడా మరోసారి రంగంలోకి దిగడం, ఆయనకు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి , ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మద్దతు ఉండటంతో కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖపోటీ ఖాయంగా కనిపిస్తోంది.
ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజల తీర్పు, ఎప్పుడూ విలక్షణమే. ఇక్కడి ప్రజల తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంశంగా మారుతుంటుంది. గతంలో టీడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను సైతం ఓడించి స్థానికుడికే పట్టం కట్టిన ఘనత ఇక్కడి ఓటర్లది. 2014 ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి టి. ఆచారికి, కాంగ్రెస్ అభ్యర్థి వంశిచంద్‍రెడ్డికి మద్య హోరాహోరి పోరు సాగింది. ఆ ఎలక్షన్స్‌లో 78 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‍రెడ్డి విజయం సాధించాడు. కానీ ఈసారి కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన టీఆర్‍ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్.. ఈసారి పార్టీలోని తన సహచరులైన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి , ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిల పూర్తి మద్దతు కూడగడితే కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖపోటీ ఖాయం. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కేవలం వందల నుంచి వెయ్యి, రెండు వేల ఓట్ల మెజారిటీతోనే గట్టేక్కే అవకాశాలే కనపడుతున్నాయి.
ఐతే బీజేపి అభ్యర్థి టి. ఆచారి మాత్రం తన గెలుపు నల్లేరు మీద నడకే అన్న ధీమాతో ఉన్నాడు. ఈయన కాన్ఫిడెన్స్‌కు కారణం, నియోజకవర్గంలో 5 సార్లు పోటీ చేసి ఓటమి చెందిన వ్యక్తిగా, ప్రజల్లో సానుభూతి పొందడం ఒకటైతే, గత ఎన్నికల్లో అత్యంత స్వల్ప మెజారిటీ 78 ఓట్లతో ఓటమి చవిచూడటం కూడా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజల నుంచి సానుభూతిని పెంచాయి. ఈసారి తనకు భారీ మెజారిటితో విజయాన్ని కట్టబెడతారని బీజేపి అభ్యర్థి టి.ఆచారి ఆశాభావంతో ఉన్నారు. ఇక టీఆర్‍ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ టికెట్ కన్ఫాం ఐనప్పటి నుంచి, ఆయనకు అసమ్మతి సెగ తగులుతూనే ఉంది. ఇక్కడి నుంచి టీఆర్‍ఎస్ తరపున టికెట్ ఆశించిన వారిలో నలుగురు వ్యక్తులు ఉండటం జైపాల్ యాదవ్‍కు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, గౌలి శ్రీనివాస్, బాలాజీసింగ్‍లు పార్టీ టికెట్ ఆశించారు. చివరకు పార్టీ అధినేత కేసీఆర్ జైపాల్ యాదవ్‍కు మరోసారి టికెట్ కేటాయించారు. దీంతో అసమ్మతి వర్గాలు గుప్పుమన్నాయి.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఐతే కేసీఆర్, కేటీఆర్‍లు రంగంలోకి దిగి కసిరెడ్డికి నచ్చజెప్పడంతో ఆయన ప్రస్తుతానికి సైలెంటయ్యారు. గురువారం నాడు జరిగిన కేటీఆర్ సభకు ఎమ్మెల్సీ కసిరెడ్డి హాజరు కాకపోతే కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారని అందరూ భావించారు. కానీ ఆ సభకు ముందురోజు రాత్రి జరిగిన చర్చల కారణంగా కేటీఆర్ సభకు, అది కూడా కేటీఆర్ వాహనంలో హైద్రాబాద్ నుంచి రావడంతో అసమ్మతి సద్దుమనిగిందన్న సంకేతాలను, కారు గుర్తు కార్యకర్తలకు చేరవేశారు. దీంతో పార్టీలోని తమ సహచరులైన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి , ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గౌలి శ్రీనివాస్, బాలాజీసింగ్‍లు పూర్తి స్థాయిలో జైపాల్ యాదవ్‍కు మద్దతుతెలిపితే, కల్వకుర్తి నియోజకవర్గంలో ట్రయాంగిల్ వారే. తమ నియోజకవర్గ ప్రయోజనాల కోసం విలక్షణమైన తీర్పునిచ్చే కల్వకుర్తి నియోజకవర్గ ఓటర్లు, ఈసారి త్రిముఖ పోటి ఉన్న ఈ సమయంలో ఎవరికి పట్టం కడతారో అన్నది ఉత్కంఠగా మారింది.