జగిత్యాలలో ప్రేమ దేశం... జంట మరణాలు చెబుతున్న నిజాలు

Update: 2018-10-01 12:22 GMT

సినిమా స్క్రిప్ట్‌కు మించిన రియల్‌ స్టోరీ.. ఇప్పటి ట్రెండ్‌కు ఏమాత్రం తగ్గని ప్రేమకథ. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించే.. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఒకమ్మాయి ఇద్దరబ్బాయిల కథ.. చివరకు మంటల్లో కాలిపోయింది. ఇద్దరి ప్రేమికుల ప్రాణాలను బలిగొంది. ఒళ్లు గగుర్పొడిచే ట్రాజెడీగా.. ముగిసింది. ప్రేమ పేరుతో చావులు, చంపడాలు ఈ రోజుల్లో కామన్‌గా మారిపోయాయి. టీనేజ్‌లో లవ్‌ పుట్టడం.. 20 యేళ్లు దాటకముందే.. ప్రాణం మీదికి తెచ్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. మూతిపై మీసం మొలవక ముందే.. మదిలో ప్రేమ పువ్వు వికసిస్తోంది. గుండెలో లవ్‌ అలారం మోగుతుంది. అది ప్రేమా, ఆకర్షణా అన్నదే తెలియని వయస్సులోనే.. చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇక ఇలాంటి ఆలోచనలకు మద్యం తోడవడంతో.. చిన్న వయస్సులోనే వారి మనస్సులు.. అడ్డదారిలో ప్రయాణిస్తున్నాయి. 

జగిత్యాలలో జరిగిన జంట మరణాలు.. ప్రేమ వ్యవహారాల్లో చీకటి కోణాలను కళ్లముందుంచుతోంది. పదో తరగతిలో అంటే సుమారు 16 యేళ్లు కూడా దాటని వయస్సులో ప్రేమలో పడ్డారు. ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం చెప్పకుండా మనస్సులో దాచుకుని మధన పడ్డారు. ఒకే అమ్మాయిని ప్రేమించామని తెలుసుకుని.. ప్రాణాలు తీసుకున్నారు. 

తెలిసీ తెలియని వయస్సులోనే.. ఎదుటి మనిషిలో కనిపించే ఆకర్షణే.. ప్రేమగా భ్రమించడం.. దానికోసం ఎంతకైనా తెగించడం.. అవసరమైతే ప్రాణత్యాగం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ రోజుల్లో 8 వ తరగతి నుంచే ప్రేమ కథలు మొదలవుతున్నాయి. పదో తరగతి వచ్చేలోగా.. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ.. ప్రేమలో పడాల్సిందే. ఓ లవర్‌ను మెయింటేన్‌ చేయాల్సిందే. లేకుంటే ఆ వ్యక్తి.. మిగతావారి కంటే వెనుకబడ్డాడంటూ ఎగతాళి చేయడం కూడా కనిపిస్తుంది. 

అయితే ఇంతవరకు ఒకలా నడిచిన ప్రేమకథలు.. ఆ తర్వాతే డేంజర్‌ టర్న్‌ తీసుకుంటున్నాయి. అసలే ఎదిగీ ఎదగని వయస్సులో పరిణితి చెందని ఆలోచనలకు.. మత్తు పదార్థాలు తోడవుతున్నాయి. ఇంకేముంది.. మెదళ్లు కలుషితమవుతున్నాయి. ప్రేమ అనే భ్రమలో ఉన్న వారంతా.. తనకు దక్కదనే ఆలోచనతో చంపడం.. లేక చావడం వంటివి చేస్తున్నారు. 

చదువుకునే వయస్సులో చదువే ప్రాణంగా ఉండాలి కానీ.. చాలామంది ప్రేమ పేరుతో.. ఎంతో విలువైన కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. అమ్మాయి లేకపోతే ఇక తన జీవితమే లేదనే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. ఇందుకు సినిమాలు కూడా తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. ఇలాంటి దారుణ సంస్కృతికి ప్రాణం పోస్తున్న మూవీలు.. విద్యార్థుల మెదళ్లలో విషాన్ని నింపుతున్నాయి. అమ్మాయి ప్రేమకోసమే జీవితం అని.. లేకుంటే దానికో అర్థం పర్థం లేదంటూ పనికిమాలిన భ్రమలను కల్పిస్తున్నాయి. 

Similar News