ఇన్‌ఫ్రంట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ఫెస్టివల్‌

Update: 2018-11-03 08:17 GMT

తెలంగాణ ఎన్నికల ప్రచారం వన్ సైడ్‌గా సాగుతోంది. 107 మంది అభ్యర్దులను ప్రకటించి, కేసీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఇప్పటికే  ఓ దఫా పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వచ్చిన గులాబీ నేతలు, ప్రచార దూకుడును తగ్గించారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో మరింతగా చెలరేగిపోవాలని, కొత్త ఆయుధాలకు పదునుపెడుతున్నారు. మరోవైపు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ఇంతలో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీని ,మోడీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశం కావడం కీలక పరిణామం. 

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని కూడగడుతానంటున్నారు చంద్రబాబు. ఇటు మహాకూటమిలో తెలంగాణ టీడీపీ భాగస్వామ్యం కావడాన్ని తీవ్రంగా ఎండగడుతన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు చంద్రబాబు రాజకీయాన్ని  నిశితంగా గమనిస్తున్నారు. టీడీపీ అధినేత దొడ్డిదారిన తెలంగాణపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం ప్రజలకు వివరించాలని, గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. స్టేట్‌లో టీఆర్ఎస్‌కు వ్యవతిరేకంగా మహాకూటమిగా జట్టు కట్టడంపై చంద్రబాబు ముద్ర స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితులతో చర్చించి, కాంగ్రెస్‌ను రాష్ట్ర స్థాయిలో ఒప్పించి మహాకూటమిగా జట్ట కట్టారు. ఉమ్మడి కార్యాచరణపై పనిచేస్తున్న కూటమి, కేవలం సీట్ల పంపకాలపై సుధీర్ఘ చర్చలు చేస్తోంది. సీట్ల పంపకాలు కూడా వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ జరుగుతున్న పరిణామాలన్నీ  నిశితంగా గమనిస్తున్నారు. రాహుల్, చంద్రబాబుల చెలిమి, స్టేట్‌లోనూ ఎలాంటి ఎఫెక్ట్‌ చూపిస్తుందన్న అంచనాలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల ఓట్ల శాతమెంత, ఇవీ రెండూ కలిస్తే, దాని ప్రభావమెంతో లెక్కలేస్తున్నారు. వీటికి తోడు జాతీయస్థాయిలో కాంగ్రెస్-టీడీపీ ఫ్రంట్‌ను, రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారన్నదానిపై చర్చిస్తున్నారు కేసీఆర్. వీరి పొత్తును ఎలా తిప్పికొట్టాలో, ఎలాంటి అస్త్రాలకు పదునుపెట్టాలో మేథోమథనం సాగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి, గులాబినేతలకు ప్రచార అస్త్రంగా దొరికింది. ఢిల్లీలో రాహుల్, బాబు చర్చల సందర్భంగా, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఢిల్లీలో  చంద్రబాబులో  సమావేశం కావడాన్ని, ఆయుధంగా మలచుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలను, ఏపీకి తాకట్టు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. ఏపీ పోలీసులు తెలంగాణలో సర్వేలు చేస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక అంతటితో ఆగకుండా భారీ బహిరంగసభల్లో చంద్రబాబు రాజకీయాలపై ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. 

తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దంగా చంద్రబాబు కూటమి కూర్పు చేసారని, అందులో భాగంగానే కాంగ్రెస్‌తో జట్టు కట్టారని, ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అమరావతికి బానిసలుగా మారారని, రాష్ట్ర అభివృద్దిని, బాబు రాజకీయాలకు బలి చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు మరోపేరుగా, తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేవ్యక్తిగా ఫోకస్ చేస్తూ, క్యాంపెయిన్‌ స్పీడ్‌ పెంచాలని, పార్టీ శ్రేణులకు ఆదేశించారు కేసీఆర్. రాహుల్ గాంధీ, చంద్రబాబుల కలయికను, మహూకూటమి పొత్తులను తీవ్రంగా తప్పుపట్టాలని, వారి పొత్తులతో తెలంగాణకు నష్టమన్న భావన, ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని సూచించారు. చూడాలి బాబు రాహుల్‌ల కలయికపై కేసీఆర్‌, ఎదురుదాడి వ్యూహం ఎలా పని చేస్తుందో...

Similar News