కీలక నిర్ణయం తీసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌...ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే...

Update: 2018-08-06 08:21 GMT

పాకిస్థాన్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌తో సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు పాక్‌ జైళ్లలో మగ్గుతున్న 27 మంది భారతీయ ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

మాజీ క్రికెటర్‌, తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయ్. గత నెల జులై 25న జరిగిన పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ చిన్న పార్టీల మద్దతును కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 11న ఇమ్రాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదాసీదాగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ వేడుకలో పాల్గొనేందుకు అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలను పంపారు.

పాకిస్థాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే భారత్‌తో సత్సంబంధాలు పెంపొందించేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే పాక్‌ జైళ్లలో మగ్గుతున్న 27మంది భారతీయులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌, భారతదేశ అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. భారత్‌కు చెందిన 27మంది మత్స్యకారులను ఈ నెల 12న కరాచీ జైలు నుంచి లాహోర్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి వాఘా సరిహద్దుకు తీసుకొచ్చి, భారత్‌కు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రయాణ సమయంలో బందీలుగా ఉన్న మత్స్యకారులకు అందించే ఆహారం వారిని ఎలా తీసుకురావాలి? తదితర విషయాలను ఇరు దేశాల అధికారులు ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. ఎవరెవరు జైలు నుంచి విడుదలవుతున్నారో వారి పేర్లను మాత్రం పాక్‌ అధికారులు వెల్లడించడం లేదు. 27 మంది భారతీయ ఖైదీలను విడుదల చేస్తే భారత్‌-పాక్‌ మైత్రీ బంధం మెరుగుపడవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 

Similar News