తెలంగాణ సర్కార్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలపై ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే 3వ తేదీకి వాయిదా వేసింది ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు.
తెలంగాణ ప్రభుత్వంపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం ఇద్దరి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ సర్కార్ అమలు చేయలేదు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు మరోసారి కోర్టు మెట్లెక్కారు. ఇద్దరు ఎమ్మెల్యేలు సర్కార్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారించిన హైకోర్టు తెలంగాణ సర్కార్‌పై సీరియస్ అయింది. శాసన సభ్యత్వ రద్దుపై కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేదని న్యాయస్థానం మండిపడింది. వారం రోజుల్లో శాసనసభ సభ్యత్వాలపై స్పష్టత ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా లేజిస్లేటివ్ సెక్రటరీలు వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని హైకోర్టు హెచ్చరించింది.
ఎమ్మెల్యేలను శాసనసభలోకి అనుమతించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ న్యాయవాదా ? లేదంటే పార్టీ న్యాయవాదా ? అంటూ ప్రశ్నించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.