క్రికెట్ పసికూన టీమిండియాకు చుక్కలు చూపించింది.. చిన్నదేశం అని లైట్ తీసుకుంటే.. ఏమౌతుందో భారత టీమ్‌కు బాగా తెలిసొచ్చేలా చేసింది.. తొలిత బౌలింగ్ లోనూ.. పరుగుల వేటలోనూ విజయానికి దగ్గరై భారత్ కు ముచెమటలు పట్టించింది.. మరో పరాభవం తప్పదనుకున్న సమయంలో.. బౌలర్లు రాణించడంతో.. ఏదోలా విజయం సాధించి అమ్మయ్య అనుకుంది రోహిత్ గ్యాంగ్..
ఆసియా కప్ లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ టీమిండియా గెలిచినా హాంకాంగ్ ముచ్చెమటలు పట్టించింది.. హాంకాంగ్ ఓపెనర్లు నిజాకత్, అన్షుమన్‌లిద్దరు భారత బౌలింగ్‌ను ఆడుకోవడంతో మరో సంచలనం ఖాయమని అనిపించింది అయితే.. చివర్లో ఖలీల్ అహ్మద్ పేస్, కుల్దీప్, చహల్‌ల మణికట్టు మాయాజాలం భారత్ పరువును నిలబెట్టాయి.
హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగగా, అంబటి రాయుడు అర్ధ సెంచరీతో రాణించాడు. అయితే ధావన్ ఔట్ అయిన తర్వాత.. భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది.. దీంతో చివరి 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 48 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో కేదార్ జాదవ్ నిలకడగా ఆడటంతో భారత్ 285 పరుగులు సాధించింది.
అయితే లక్ష్య ఛేదనకు దిగిన హాంకాంగ్ ఓ దశలో టీమిండియాకు ముచ్చెమటలు పోయించింది. ఆ జట్టు ఓపెనర్లు నిజాకత్ ఖాన్, అన్షుమన్ టీమిండియా బౌలర్లను సులువుగా ఎదుర్కున్నారు.. బౌండరీతో మొదలైన ఇన్నింగ్స్‌ను వేగంగా పరుగు పెట్టించారు. భారత బౌలర్లు, ఫీల్డర్లుకు చెక్కలు చూపించారు.. అయితే జట్టు స్కోరు 174 పరుగుల వద్ద కెప్టెన్ అన్షుమన్.. రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ నిజాకత్ కూడా సెంచరీ చేయకుండానే వెనుదిరగడంతో.. భారత్ ఊపిరి పీల్చుకుంది.. అనంతరం భారత బౌలర్లు విజృభించడంతో హాంకాంగ్.. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 259 పరుగులు మాత్రమే చేయగలిగింది. పసికూన అని లైట్ తీసుకున్న టీమిండియాకు.. హాంకాంగ్.. షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చింది..