ఫోర్‌స్టేట్స్.......ఫోర్త్ఎస్టేట్....... ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి?
కాలం మారిపోయింది. మారిపోయిన కాలంతో పాటు నిర్వచనాలు మారిపోతున్నాయి. ఎన్నికలు అంటే ప్రచారం, బహిరంగ సభలు, ఉద్వేగపూరితమైన ప్రసంగాలు అనుకొనే రోజులు పోయాయి. ఎన్నికలు అంటే...ఓ వ్యూహాత్మక యుద్ధం. ఆటలైనా...ఎన్నికలైనా...ప్రత్యర్థులను పడగొట్టాలంటే...కచ్చితమైన వ్యూహం ఉండాలి...ఆ వ్యూహాన్ని సమర్థవంతంగా ఆచరణలో పెట్టే సుక్షితులైన సైనికులలాంటి నాయకులు ఉండితీరాలి. త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం...అధికార బీజెపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పటిష్టమైన బృందాలతో పోల్ మేనేజ్ మెంట్ సమరానికి సిద్ధమయ్యాయి.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు...సన్నాహమా అన్నట్లుగా జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం జోరందుకొంది. ప్రధాని నరేంద్ర మోడీ, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒకే రోజున ఛత్తీస్ గఢ్ లో జరిగిన పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని విమర్శలు, ప్రతివిమర్శలతో మోతెక్కించారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం వెనుక..బీజెపీకి చెందిన బలమైన నిపుణుల బృందమే ఉంది.
2019 లోక్ సభ ఎన్నికల ద్వారా తిరిగి అధికారం చేపట్టడానికి..రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. మోదీ కమ్ బీజెపీ వ్యతిరేకతను తన అధికారానికి సోపానంగా చేసుకోడానికి పక్కా వ్యూహాలతో సిద్ధమయ్యింది. ప్రస్తుత ఐదురాష్ట్రాల ఎన్నికల సెమీఫైనల్లోనే కమలనాథులను కకావికలు చేయగలమన్న ధీమాతో ఉంది. సలహాలు, సూచనల కోసం..ఓ ప్రత్యేక వ్యూహ బృందంతో బరిలోకి దిగింది.