అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. హస్తం పార్టీ నేతలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కుదుపుతోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పేరున్న మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించింది. సురేష్‌రెడ్డి కూడా హస్తానికి హ్యాండిచ్చి.. కారులో షికారుకు సై అన్నారు. ఈనెల12న తన అనుచరులతో టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకోనున్నారు. సురేష్‌రెడ్డి పార్టీ వీడనుండటం వల్ల నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు కొలుకోలేని దెబ్బతగిలింది. ఆయన పార్టీ మార్పుతో రెండు నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం పడనుంది. సురేష్‌రెడ్డి రాకతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన సురేష్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. 1984లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజకీయ ఆరగేంట్రం చేసిన సురేష్‌రెడ్డి చెన్నారెడ్డి హయాంలో 1989లో తొలిసారిగా బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999, 2004 ఎన్నికల్లోను వరుసగా బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వై.ఎస్ ప్రభుత్వంలో స్పీకర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించారు. 2009లో నియోజకవర్గం మార్చి ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లోనూ స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిసోయారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలపై కన్నసిన సురేష్‌రెడ్డి రెండు నియోజకవర్గాల్లో విస్తృత కార్యక్రమాలు చేశారు. ఓ దశలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేయాలని ఒత్తిడి వచ్చింది. ఐతే అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈనెల 12లోపు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకోనున్నారు.
మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చేసిన ప్రకటనతో కాంగ్రెస్ నేతలు షాక్‌కు గురయ్యారు. జిల్లాలో బలమైన నాయకునిగా ఉన్న సురేష్‌రెడ్డి పార్టీనీ వీడనుండటంతో జిల్లా కాంగ్రెస్ శిబిరంలో కలవరం మొదలైంది. ముందస్తు ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించి జోష్ మీద ఉన్న టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బకొట్టడంతో షాక్ నుంచి ఆ పార్టీ నేతలు తేరుకోలేకపోతున్నారు. సురేష్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు ఎమ్మెల్యే అభ్యర్ధులుగా టికెట్లు ఖరారు చేశారు. సురేష్‌రెడ్డికి సముచిత స్ధానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సురేష్‌రెడ్డికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఉత్సాహాంగా ఉన్నారు. ఆర్మూర్ లేదా బాల్కొండ నుంచి బరిలో నిలిచేందుకు సై అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సురేష్‌రెడ్డి పోటీ చేస్తే ప్రస్తుతం ప్రకటించిన సిట్టింగ్‌లలో ఇద్దరిలో ఒకరికి బీ ఫాం గండం పొంచి ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఏమైనా సురేష్‌రెడ్డి హస్తం పార్టీనీ వీడటం రాష్ట్ర కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌గా ఉన్నా.. జిల్లాలోని కొందరు నేతలు సంబర పడుతున్నారు. ఆర్మూర్, బాల్కొండ టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల అనుచరులు తమ నేతకు పోటీ తప్పిందని సంబరాల్లో మునిగారు. ఇటు టీఆర్ఎస్‌లో మాత్రం ఇద్దరు సిట్టింగ్‌లలో టెన్షన్ మొదలైంది.