ఎన్నికలు ముగిసినా, ఎగ్జిట్‌పోల్స్ వెల్లడైనా, వెయ్యి ఓల్టుల ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. ఈవీఎంలో నిక్షిప్తమైన ఓటరన్న తీర్పు వరకూ, ఆ సస్పెన్స్‌పై ఎవరి వాదన వారిదే. ఎవరి ధీమా వారిదే. ఎవరి లెక్కలు వారివే. ఈ లెక్కలన్నీ పక్కనపెడితే, ఎవరు గెలిస్తే ఏమవుతుంది. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో మలుపులేంటి ఇలాంటి అంశాలవైపు చర్చలు మళ్లుతున్నాయి. ఇంతకీ ఎవరి గెలుప ఏ మలుపు
కారు గేరు మార్చి, రయ్యిన దూసుకెళ్లిందని అత్యధిక సర్వేలు ఢంకా బజాయించాయి. సైకిల్‌తో సవారీ చేసిన హస్తం, అదే కారుకు బ్రేకులేస్తుందని లగడపాటి సస్సెన్స్ మీటర్ పెంచేశారు. ఇక నాలుగు రాష్ట్రాల్లోనూ, హస్తానిదే హవా అని కొన్ని సర్వేలు, పోటాపోటీ తప్పదని మరికొన్ని సంస్థల అంచనాలు, ఉత్కంఠను పీక్ లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. జనాల బుర్రలను మరింత హీటెక్కిస్తున్నాయి. దేశంలో అత్యంత ఉత్కంఠ రేపాయి ఐదు రాష్ట్రాల ఎన్నికలు. జనం తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎగ్జిట్‌పోల్స్ కూడా అనేక జోస్యాలు చెప్పాయి. ఎవరు గెలుస్తారన్న విషయంలో ట్రైలర్ ఇస్తాయనుకుంటే, మరింతగా నరాలు తెగే ఉత్కంఠను పెంచాయి సర్వేలు.
తెలంగాణలో దాదాపు అన్ని జాతీయ ఛానెళ్ల సర్వేలు, తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టాయి. టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీలు మాత్రం పోటాపోటీ తప్పదన్నట్టుగా, లేదంటే హంగ్ వస్తుందన్నట్టుగా జోస్యం చెప్పాయి. అత్యధిక ఛానెళ్ల జోస్యంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరపడ్డాయి. పూర్తి మెజారిటీతో గెలిచేది తామేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. మరుసటి రోజు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలోనూ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.అయితే, గాలి మొత్తం కేసీఆర్ వైపు ఉందనుకుంటున్న తరుణంలో, ఒక్కసారిగా గులాబీ కార్యకర్తల ఉత్సాహంపై నీళ్లు చల్లారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ప్రజాకూటమిదే అధికారమని చెప్పి, మరింత సందిగ్దంలో పడేశారు.ఓటింగ్ శాతం భారీగా పెరగడంతో మహాకూటమి నేతలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ, అధికారం తమదేనని ప్రకటించుకున్నారు.
తెలంగాణపై ఇలా సస్పెన్స్ కొనసాగుతుంటే, ఇక మిగతా నాలుగు రాష్ట్రాల సర్వేలు కూడా ఉత్కంఠ పెంచుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని పల్స్ చెబుతుండగా, ఒక్క రాజస్థాన్‌లోనే హస్తం పార్టీదే హవా అని, అన్ని ఎగ్జిట్‌పోల్స్ తేల్చేశాయి. అయితే అంకెల మధ్య పెద్ద తేడా మాత్రం లేదని చెప్పాయి. దీంతో రిజల్ట్స్‌పై క్యురియాసిటీ మరింతగా పెరుగుతోంది. పార్టీలు కూడా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.