కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో బాగా వినినపించిన ఈ పేరు ప్రస్తుతం అప్పుడప్పుడే వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ మాజీ సీఎం మళ్ళీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని వార్తలు చక్కర్లు కొట్టినా అది నిజం కాలేదు. అయితే ఎన్నికల వేళ కిరణ్ కుమార్ రెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు గాలం వేస్తున్న పార్టీ ఏది..? ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు..?
కిరణ్ కుమార్ రెడ్డి చేరిది కమలం గూటికా..హస్తం పంచనా.. లేదంటే సైకిల్ సవారీ చేసేస్తారా..?
ఈ ప్రశ్నలకు కొంతకాలంగా సమాధానమే దొరకడం లేదు. అయితే ఎన్నికలు దగ్గపడుతున్న వేళ మరోసారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకొచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి...ఆ తర్వాత సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైనప్పట్నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించకుండా ఇంటికే పరిమతమయ్యారు. ఇటీవల కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో కిరణ్ కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరతారని కూడా ప్రచారం జరిగినా అదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన్ను మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మర మయ్యాయి.
విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ....తిరిగి పుంజుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ నేతలు గత ఎన్నికల సమయంలో పార్టీకి దూరమైన వారిని తిరిగి రప్పించాలని తీర్మానించారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీతో రెండుసార్లు సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. తర్వాత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కూడా ఈ మాజీ సీఎంతో మంతనాలు సాగించినట్లు సమాచారం.
తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని కోరారు. ఏపీ కాంగ్రెస్‌లో కీలక పదవితో పాటు ఏఐసీసీలో పదవి ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమన్ చాందీతో చర్చించాక తుది నిర్ణయం చెబుతానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు సమాచారం. మరి దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కిరణ్‌కుమార్ రెడ్డి దారి ఎటువైపు ఉంటుందో వేచి చూడాలి.