ఎన్నికల సన్నద్ధతపై పూర్తి సంతృప్తి చెందాకే షెడ్యూల్ ఖరారు చేస్తామంటోంది ఎన్నికల కమిషన్. అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్న తర్వాతే, తేదీలను ప్రకటిస్తామంటోంది. అలాగే, రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టో విడుదల చేసేముందు డ్రాఫ్ట్ ను, ఎన్నికల సంఘానికి ఇవ్వాలంటోంది. ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామంటోంది ఈసీ. తెలంగాణలో ఎన్నిక నిర్వహణ, ఏర్పాట్లపై ఎప్పటికప్పడు సమీక్షలు చేస్తోంది ఎన్నికల కమిషన్. ఈసారి ధన,మద్యం ప్రవాహంను అడ్డుకునేందుకు గట్టి నిఘా పెత్తామని అంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రెండు రోజులు హైదరాబాద్‌లో పర్యటించి, ఎన్నికల సన్నద్దతపై ఈసీకి నివేదిక ఇచ్చారంటున్న ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, రిపోర్ట్‌లను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని చెప్పారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు రజత్ కుమార్. బూత్ స్థాయి అధికారులు ప్రతిరోజూ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహనా, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆసిఫాబాద్ మొదలుకొని మూడు, నాలుగు జిల్లాలకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు చేరుకున్నాయని, 18వ తేదీ వరకు అన్ని జిల్లాలకు చేరుతాయని చెప్పారు రజత్ కుమార్. యంత్రాలు చేరిన వెంటనే రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి స్థాయి తనిఖీ ఉంటుందని వివరించారు. శాంతిభద్రతల నిర్వహణ, ఎన్నికల్లో ధనప్రవాహం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.