సోషల్ మీడియాపై నజర్ వేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, ప్రచారంపై నిఘా పెట్టింది. వెట్ ట్రోన్ వ్యవస్థను తీసుకురానుంది. అభ్యర్థులకు దిమ్మతిరిగేలా రూల్స్ ఫ్రేమ్ చేస్తోంది. ఇప్పుడు ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోనే. నిరంతరం వాట్సాప్, ఫేస్‌బుక్ నోటిఫికేషన్లు. అటు దేశంలో అత్యధికంగా ఉన్న ఇలాంటి యువతనే టార్గెట్ చేసుకుని, రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియా అడ్డాగా వలేస్తున్నాయి. అంతేకాదు, ప్రత్యర్థులపై పరస్పర మాటల యుద్ధం, హీటెక్కిస్తోంది.
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో యువత కీలకపాత్ర పోషించనుంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారి శాతం ఈసారి గణనీయంగా పెరిగింది. యువ ఓటర్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. అందువల్ల ప్రధానరాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలు సోషల్ మీడియాను ఉధృతంగా వాడుకుంటున్నాయి. పోస్టింగ్‌లు, కామెంట్లు, స్పూఫ్‌లతో ఎన్నికల వేడెక్కిస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారంతోనే ఎక్కువగా లబ్ధి పొందింది బీజేపీ. ఇది గమనించిన కాంగ్రెస్, అప్పటి నుంచి తాను కూడా సామాజిక మాధ్యమాల్లో దూకుడు పెంచింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సోషల్ మీడియాలో జోరు ప్రదర్శిస్తున్నాయి. ఇరు పార్టీలు బూతుస్థాయి, డివిజన్ స్థాయి, నియోజకవర్గాల స్థాయి ఇన్‌చార్జ్‌లను నియమించి సైబర్ వార్ సెగలు రేపుతున్నారు.
డిసెంబర్‌లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో, ఎన్నికల కమిషన్ నిఘాపెట్టింది. ఈ ప్రచార వివరాలను నామినేషన్ పత్రాల్లో తెలియజేసేలా నిబంధనలను రూపొందిస్తోంది. దీంతో సోషల్ మీడియాను నిర్వహించే టీమ్‌ల పూర్తి వివరాలను నామినేషన్ పత్రంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సోషల్‌మీడియా మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థులు నిర్వహించే ప్రచారాన్ని కూడా ఎన్నికల ఖర్చులో జమచేయాలన్న నిర్ణయించింది ఈసీ.
సోషల్ మీడియాలో జరిగే ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు సిద్దమైంది ఈసీ. వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు, కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నిపుణులను ఉపయోగించుకుని తగిన, వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని వారు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారాన్ని పర్యవేక్షించడం సవాలుతో కూడినదే అయినప్పటికీ, ఆ విధానాన్ని తప్పకుండా తీసుకొస్తామని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియాకు వర్తించే ఎంసిసి నిబంధనలే, సోషల్ మీడియాకూ వర్తిస్తాయంటోంది ఈసీ. మరోపక్క సోషల్ మీడియాలో, మాటల యుద్ధం, పరస్పర ఆరోపణల పర్వం, శ్రుతిమించితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఎన్నికల కమిషన్.