సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే పార్టీ అధిష్టానం కూడా వ్యూహరచన చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి దీటైన అభ్యర్థిగా.. నియోజకవర్గంలో పేరున్న నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డిని రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది.
మారుమూల గ్రామాల కలయికతో 1957లో దొమ్మాట నియోజకవర్గం ఏర్పడింది. 50 ఏళ్ల పాటు దొమ్మాట నియోజకవర్గంగా కొనసాగి.... 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం దుబ్బాక కాన్సిస్టెన్సీగా రూపాంతరం చెందింది. ఇక్కడి నుంచి ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందగా, నాలుగుసార్లు టీడీపీ, మూడుసార్లు టీఆర్ఎస్ విజయం సాధించింది. ఒకసారి పీడీఎఫ్, ఇంకోసారి ఇండిపెండెంట్ గెలుపొందారు. టీడీపీ నుంచి గెలిచిన చెరుకు ముత్యంరెడ్డి మంత్రిగా పనిచేశారు. తర్వాత పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాతున్నారు.
ప్రత్యేక రాష్ట్ర కోసం సిద్దిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోనూ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. తెలంగాణవాదం బలంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు, ఉపఎన్నికలో ఒకసారి ఆర్ఎస్ పార్టీ నుంచి జర్నలిస్ట్ రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా అప్పట్లో టీడీపీలో ఉన్న ముత్యంరెడ్డికి టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి రామలింగారెడ్డిపై గెలిచారు. దుబ్బాక నుంచి నాలుగుసార్లు గెలిచిన ముత్యంరెడ్డి అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించారని చెప్పుకుంటారు. గ్రామ గ్రామాన సీసీ రోడ్డులు, డివైడర్‌లతో కూడిన డబుల్ రోడ్డు సౌకర్యం కల్పించారు. కమ్యూనిటీ భవనాలు, డ్వాక్రా భవనాలు నిర్మించారు. ముత్యంరెడ్డి హయాంలోనే రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా, అభివృద్ధికి మోడల్‌గా నియోజకవర్గాన్ని నిలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు.
ఇక దుబ్బాక నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ముత్యంరెడ్డితో పాటు... డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. 2014లో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీచేసిన శ్రవణ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి దుబ్బాక నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలంటే సీనియర్ నేత ముత్యంరెడ్డి పార్టీ అభ్యర్థిగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్న నేతగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచిన నేతగా ముత్యంరెడ్డికి పేరుంది. ఆయనుకున్న అనుభవం దృష్ట్యా ఆయనకే టికెట్ ఇవ్వాలని పార్టీ సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.