తెలంగాణ ఎన్నికల సీన్‌లో, కింగ్ మేకర్ అవుతానని అక్బరుద్దీన్ ఊహిస్తుంటే, అటు దాదాపు సగం నియోజకవర్గాల్లో ముస్లింల ఓటర్లే జయాపజయాలు డిసైడ్ చేసే, కింగ్ మేకర్స్ అని లెక్కలు చెబుతున్నాయి. మార్జిన్‌లో అభ్యర్థుల తలరాతలను మార్చేది, ముస్లిం జనాభేనని సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో ముస్లిం ఓటర్ల సంఖ్యఎంత...ఏయే నియోజకవర్గాల్లో వారి ప్రభావం ఉంటుంది? 53 నియోజకవర్గాల్లో ముస్లింలే కీలకం ముస్లింలను ఆకట్టుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వ్యూహాలు.
ముస్లింల జనాభా.. దక్షిణాదిలో కేరళ, కర్ణాటక తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 12.7 శాతం ఉన్నారు. అయితే వీరు చెల్లాచెదురుగా కాకుండా కొన్ని నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నారు. పైగా ఇతర వర్గాల మాదిరిగా వేర్వేరు పార్టీలకు కాకుండా ఏదో ఒకవైపే మొగ్గు చూపే ధోరణి ముస్లింలలో ఎక్కువగా ఉంటోంది.
రాష్ట్రంలో 53 నియోజకవర్గాల్లో ముస్లింలు ఆయా అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నారు. దీంతో రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లకు గాలం వేస్తున్నాయి. వారిని తమ వైపు తిప్పుకోవడానికి అటు టీఆర్‌ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది తామేనని, ముస్లిం ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ భరోసాగా ఉంటే12 శాతం రిజర్వేషన్ల హామీ నెరవేరకపోయినా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో మైనారిటీలు తమకే మద్దతుగా నిలుస్తారని టీఆర్‌ఎస్ భావిస్తోంది. హైదరాబాద్‌లోని 14 శాసనసభ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు గరిష్ఠంగా 80 శాతం నుంచి కనిష్ఠంగా 13 శాతం వరకు ఉన్నాయి.
పాతబస్తీలో ముస్లింలు 50 శాతం పైగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో దీర్ఘకాలంగా మజ్లిస్ పాగా వేసింది. మజ్లిస్‌కు ఆ ఏడు నియోజకవర్గాల్లో సహకరిస్తే రాష్ట్రంలో మిగతా చోట్ల ముస్లిం ఓట్లు తమకు పడతాయని ఇతర పార్టీలు ఆశిస్తున్నాయి. గతంలో మజ్లిస్‌తో కాంగ్రెస్‌కు ఇలాంటి లోపాయకారీ అవగాహన ఉండేది. ఇప్పుడు మజ్లిస్‌కు టీఆర్‌ఎస్‌కు మధ్య దోస్తీ కుదిరింది. మజ్లిస్‌తో తమకు స్నేహపూర్వక పోటీ ఉంటుందని కొంగరకలాన్ సభలో కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే ప్రధాని మోదీని గట్టిగా ఢీకొంటున్న తమ పార్టీకే ముస్లింలు జైకొడతారని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. ఈసారి పాతబస్తీలో కూడా మజ్లిస్‌కు ధీటుగా మహాకూటమి అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షకు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఖమ్మం, కొత్త గూడెం నియోజక వర్గాల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిర్పూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, శ్రీరాంపూర్ ప్రాంతాలలోనూ ముస్లిం ఓట్ల సంఖ్య అధికంగానే ఉంది. గెలుపునకు ఇవే కీలకం కానున్నాయి.