నిజామాబాద్ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరుగుతోందా ?

Update: 2018-06-28 06:25 GMT

నిజామాబాద్ రాజకీయాల్లో ఆధిపత్య పోరు తారా స్ధాయికి చేరిందా ? కారు పార్టీ కోరి తెచ్చుకున్న  సీనియర్ నేత డీఎస్‌కు పొమ్మనలేక పొగబెడుతోందా ?  అధిష్టానంపై అసంతృప్తితోనే డీఎస్ సొంత గూటికి చేరుకోవాలని భావిస్తున్నారా ? నిజామాబాద్ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరుగుతోందా ? ఇందురులో హాట్‌హాట్‌గా సాగుతున్న పాలిటిక్స్‌లో డీఎస్‌ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి ?       

నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత డి. శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు ఒక్కటయ్యారు. పట్టణంలోని ఎంపీ కవిత నివాసంలో భేటీ అయిన నేతలు డి.ఎస్. వ్యవహారంపై చర్చించారు. డి. శ్రీనివాస్ తనయుడు అరవింద్‌  బీజేపీలో ఉంటూ తాను టీఆర్ఎస్ లో కొనసాగడటంపై పలువురు నేతలు అభ్యంతరం చెప్పారు. డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని  క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలంటూ సీఎంకు లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

టీఆర్ఎస్ అధిష్టానంపై డీఎస్‌ గత కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కులాల వారిగా సమావేశాలు నిర్వహించడంతో డీఎస్‌‌కు జిల్లా నేతలకు మధ్య అగ్గి రాజుకుంది. ఇదే సమయంలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా డీఎస్ అనుచరులు బహిరంగ వ్యాఖ్యలు చేయడం దీన్ని ఆయన లైట్‌గా తీసుకోవడం మరో వివాదాన్ని రగిల్చింది. దీంతో పాటు బీజేపీలో చేరిన డీఎస్‌ తనయుడు ధర్మపురి అరవింద్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు రావడంతో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. డీఎస్‌కు వ్యతిరేకంగా ఏకమైన జిల్లా నేతలు బహిరంగానే ఎదురుదాడి ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు తనలోని అసంతృప్తిని ఏనాడు బయటపెట్టని డీఎస్‌ తనపై నేతలు చేసిన ఫిర్యాదును లైట్‌గా తీసుకుంటున్నారు. తన కుమారుడి జీవితాన్ని తానెలా ప్రభావితం చేస్తానంటూ సమర్ధించుకుంటున్నారు.  

ముందస్తు వ్యూహంలో భాగంగానే డీఎస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. డీఎస్‌ పెద్ద కుమారుడు మాజీ మేయర్ సంజయ్‌కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అయినా తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లోకి వచ్చారంటున్నారు. అయితే ఈ ఊహాగానాలను డీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నారు.  పార్టీకి వ్యతిరేకంగా నడుచుకునే పని తాను చెయ్యలేదంటూనే  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమంటున్నారు. అయితే జిల్లాలోని తాజా పరిణామాలు టీఆర్ఎస్ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి  వివాదం కొనసాగుతుండగానే డి.శ్రీనివాస్‌పై చర్యలకు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో డీఎస్‌ ఎటు అడుగులు వేస్తారనేది ఆసక్తిగా మారింది.

Similar News