తుపాన్లకు ఈ పేర్లేంటి.. ఎక్కడిదీ సంప్రదాయం.. ఎలా వచ్చింది? 

Update: 2018-12-17 04:56 GMT

సముద్ర తీర ప్రాంతాలకు తుపానుల ముప్పు కొత్తేమి కాదు. సముద్రంలో వాతావరణంలో తేడాల వల్ల ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి.. సముద్ర గర్భంలోనే సుడులు తిరుగుతూ కదలడాన్ని తుపాన్ అంటారు. ఈ  వాయుగుండం వాతావరణంలో పీడన శక్తికి లోబడి  పరిస్థితిని బట్టి బలహీన పడుతుంది. లేదా ఒక్కోసారి ఉష్ణోగ్రతల్లో తేడాల వల్ల బలపడి తీరానికి వచ్చి ఊళ్లకు, ఊళ్లనే తుడిచి పెట్టేస్తుంది.. తుపాను వల్ల తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంటుంది. తుపాను కేంద్రం ఉన్న ప్రాంతంలో సముద్రం చాలా గంభీరంగా, ఎలాంటి  సంకేతాలు లేకుండా చాలా స్థిరంగా, నిశ్చలంగా కనిపిస్తుంది. దీన్నే తుఫాను ముందర ప్రశాంతత అంటారు. 

కానీ దీని ప్రభావం చుట్టు పక్కల ప్రాంతాల్లో చూపిస్తుంది. ఈదురు గాలులు, భారీ వర్షాలు, జన జీవనాన్ని ఛిద్రం చేస్తాయి. తీరం వెంబడి గంటకు 150 కిలోమీటర్లకు పైగానే  వేగంతో గాలులు వీస్తాయి. పెను గాలుల ధాటికి ఇళ్లు కుప్పకూలడం, చెట్లు కూలడం, విద్యుత్ వైర్లు దెబ్బతినడం, టెలిఫోన్ కనెక్షన్లు తెగిపోవడం .. చివరకు ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో మునిగిపోతాయి. ఆంధ్ర రాష్ట్రానికి తుపానులతో చాలా అనుభవమే వుంది. 1977, నవంబర్ 19న వచ్చిన దివిసీమ ఉప్పెన ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ తుపాను ధాటికి వేలల్లో చనిపోగా, లక్షల్లో నిరాశ్రయులయ్యారు.. అప్పటినుంచి అడపా దడపా తుపాన్లు మనల్ని వెంటాడుతూనే వున్నా..తరచుగా వస్తున్న ఈ ఉత్పాతాలను గుర్తించి, రికార్డు చేయడానికి వీలుగా వాటికి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. హిందూ మహాసముద్ర ఉత్తర ప్రాంతం తరచూ తుపాన్లకు బలవుతుండటంతో ఈ ప్రాంతాన్ని తాకే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ మొదలు పెట్టింది. 

బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి మొదలైంది. ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగా ఏర్పడిన ఐఎండీ ఏడు దేశాలకు వాతావరణ హెచ్చరికలను పంపుతూ వుంటుంది. తుపాను గుప్పిట చిక్కే బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు వీటికి పేర్లు పెడతాయి. ఈ దేశాలు పంపే పేర్లను ఆయా సభ్య దేశాల ముందు అక్షరాలను బట్టి ఒక జాబితాలా తయారు చేస్తారు.  ఇప్పటి వరకూ తుపాన్లకు 64 పేర్లు సిద్ధం చేయగా వాటిలో 22 పేర్లను వాడారు. అవే ఐలా, ఫైయాన్, లైలా, ఫెట్, పెథాయ్‌ లాంటి పేర్లన్నీ ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలోని దేశాలు సూచించినవే. ఇవే కాక నర్గీస్, బందు.. అనే పేర్లను శ్రీలంక సూచించింది. 2006లో వచ్చిన  తుఫానుకు ఓగ్ని అని పేరు పెట్టారు. ఇది కృష్ణా జిల్లాను కోలుకోలేని దెబ్బతీసింది. దాదాపు 600 కోట్ల విలువైన పంటలు సర్వ నాశనమయ్యాయి. 2008లో వచ్చిన తుఫానుకు ఖైముక్ అని నామకరణం చేశారు. ఈ తుపాను వల్ల కాకినాడ తీరప్రాంతంలో అపార నష్టం జరిగింది.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పంటను సర్వనాశనం చేసేశాయి. అదే ఏడాది నవంబర్ 29న బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది.. దానికి నిశా అని పేరు పెట్టారు. నిశా తుఫాను వల్ల  దక్షిణ కోస్తా, రాయలసీమ భారీ వర్షాలకు కుదేలయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగాయి. జన జీవనం అతలాకుతలమైంది. నిశా తుఫాను మన రాష్ట్రం కన్నా తమిళనాడునే ఎక్కువ దెబ్బ తీసింది. మృతుల సంఖ్య వందలకు చేరుకుంది. ఇక 2010 మే 21న  ఆంధ్ర కోస్తా తీరాన్ని కల్లోలపరచిన తుఫాను పేరు లైలా.. ఈ పేరు పెట్టమని పాకిస్థాన్ దేశం మన వాతావరణ శాఖకి సూచించింది. ఆ తర్వాత 2014లో ఉక్కునగరం విశాఖను విషాదభరితం చేసింది హుద్‌హుద్‌ తుపాను. ఇక అరేబియా సముద్రానికీ తుఫాను బెడద వుంది. కాకపోతే బంగాళాఖాతంతో పోల్చితే తక్కువ.. అక్కడ  2007లో వచ్చిన తుఫానుకు గోను అని పేరు పెట్టారు.. అమెరికాలో తుఫాన్లకు పేరు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో వుంది. అమెరికాను అతలాకుతలం చేసిన కత్రినా తుఫాను బీభత్సం ఆదేశాన్ని ఇప్పటికీ వణికిస్తూనే వుంది.

Similar News