భార్యల వివాహేతర సంబంధాలతో బాధితులుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న భర్తలు
నాతిచరామి నవ్వులపాలవుతోంది. తాళి, ఎగతాళి అవుతోంది. అనుబంధం అపహాస్యమవుతోంది. రెండు హృదయాలు, మూడుముళ్లు, ఏడడుగులు, నూరేళ్ల భార్యాభర్తల బంధం, బదనాం అవుతోంది. సాధారణంగా భర్తల చాటుమాటు వ్యవహారాలను భార్యే కనిపెట్టి బజారుకీడ్చేది. ఇప్పుడు దీనికి రివర్స్, భర్తే భార్య ఇల్లీగల్ ఎఫైర్‌పై నిఘాపెట్టి, ఆధారాలతో సహా సేకరించి, ప్రియుడు, భార్య బాగోతాన్ని బయటపెడుతున్నాడు. మొన్న ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లిఖార్జున్ రెడ్డి వ్యవహారం మర్చిపోకముందే, తాజాగా హైదరాబాద్‌లో మరో రెండు వివాహేతర బంధాల్లో భర్తలే బాధితులుగా పోలీసు స్టేషన్లమెట్లెక్కారు. భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకుంటున్న ఘటనలు, అందరికీ ఆవేదన కలిగిస్తున్నాయి. కొన్ని ఘటనల్లో పక్కచూపులు చూసే భర్త భార్యను చీటింగ్ చేస్తే, కొన్నింట్లో భార్యే భర్తను మోసం చేస్తోంది. కొన్నింట్లో భార్య భర్త బాగోతాన్ని బయటపెడితే, మరికొన్నింట్లో భర్తే, పెళ్లాం వివాహేతర వ్యహారాలను బయటపెట్టేస్తున్నాడు. ఇదిగో తాజాగా ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది.
కానిస్టేబుల్ సందీప్‌తో స్నేహకు వివాహేతర బంధం
నాగరాజు ఉండేది శంషాబాద్ ఆదర్శనగర్‌లో నాలుగేళ్ల క్రితం స్నేహతో వివాహమైంది. వారికి ఒక బాబుకూడా ఉన్నాడు. ఇదిలాఉండగా స్నేహకు కొన్నిరోజుల క్రితం మొఘల్ పురా పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ సందీప్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వీరిద్దరి మద్య వివాహేతర బంధానికి వారధి అయ్యింది. స్నేహ సందీప్‌లు ప్రతీరోజూ చాటింగ్ చేసేవారు. ఫోన్లో మాట్లాడేవారు. కొన్నాళ్ల తరువాత పుట్టింటికి వెళ్తున్నాని భర్తకు చెప్పి, స్నేహ సందీప్‌తో కలిసి బయటకు వెళ్లేది.
భార్య కదలికలపై భర్త నిఘా
స్నేహ వ్యవహారం నాగరాజకు అనుమానం కలిగించింది. దీంతో ఆమె కదలికలపై దృష్టిసారించిన నాగరాజు, ఓ స్మార్ట్ ఫోన్ ఆమెకు కొనిచ్చాడు. తరువాత కొన్నాళ్లకు స్నేహ ఫోన్‌కు ఉన్న ప్రీపెయిడ్ కనెక్షన్ ను, పోస్ట్ పెయిడ్ గా మార్పించాడు. అలా ఆమె ఫోన్లోని చాటింగ్ హిస్టరీని..కాల్ డేటాను..సందీప్ తో కలిసి స్నేహ బయటకు వెళ్లినప్పటి ఫోటోలను నాగరాజు సంపాదించాడు.
ఇల్లీగల్ ఎఫైర్‌పై ఆధారాలు సేకరించిన నాగరాజు
ఐతే.. ఈ విషయమై స్నేహను నిలదీస్తే ఆ ఆరోపణలను కొట్టిపారేసిది. భర్తతో వాదనకుదిగేది. స్నేహ మెళ్లో నల్లపూసల హారం చూసి నాగరాజు ఆమెను నిలదీస్తే అది మామూలు హారమంటూ కొట్టిపారేసింది. చివరకు పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించిన నాగరాజు, తన భార్యకు సందీప్ తో ఉన్న అక్రమసంబంధంపై క్లారిటీ వచ్చాక, శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే..పోలీసులు మాత్రం అతడి ఫిర్యాదు స్వీకరించలేదు.
పక్కచూపులపై భార్యాభర్త మధ్య గొడవలు
ఈ క్రమంలో ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగటంతో చివరకు స్నేహ తనను భర్త, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఐతే..నాగరాజు తన భార్యకు సందీప్ తో ఉన్న అక్రమసంబంధం తాలూకు ఆధారాలను పోలీసుల మందుంచాడు. దీంతో సందీప్, స్నేహలమీద పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్, స్నేహలు పెళ్లికూడా చేసుకున్నారని ఆరోపిస్తున్నాడు నాగరాజు. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోస్ బయటపెట్టిన నాగరాజు, వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. తన పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన సందీప్ ను ఉద్యోగం నుంచి తొలిగించాలంటున్నాడు.
భార్యాభర్తల అనుబంధాలపై అన్ని మతాలు గొప్పగా చెప్పాయి. కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టాయి. ప్రేమ, నిజాయితీ, పరస్పర నమ్మకం ఉండాలని విడమరచి చెప్పాయి. కానీ ఈ కలియుగంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే, భార్యాభర్తల అనుబంధం అపహాస్యం అవుతుండటం అందరికీ ఆవేదన కలిగిస్తోంది. దారి తప్పిన భర్తలను సమాజం నీచంగా చూస్తుంటే, ఇప్పుడు పరాయి వ్యామోహంతో సంసారాన్ని నాశనం చేసుకుంటున్న కొందరు భార్యలు, అనుబంధాన్ని అల్లరి చేస్తున్నారు. శంషాబాదే కాదు, మేడ్చల్‌లోనూ భర్తను మర్డర్ ప్లాన్ చేసి, దొరికిపోయింది ఒక భార్య.
మొన్న ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీలో అడిషినల్ ఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లిఖార్జున్‌ల వ్యవహారం కూడా, పతనమవుతున్న కుటుంబ వ్యవస్థకు నిదర్శనం. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సునీతారెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డిలు, పక్కచూపులకు లొంగిపోయి, ఇరువురి జీవితాలను రచ్చ చేసుకున్నారు. కుటుంబాలను క్షోభకు గురి చేశారు. డిపార్ట్‌మెంట్‌లో సస్పెన్షన్‌కు గురికావడమే కాదు, పరువూ పొగొట్టుకున్నారు. భర్త సురేందర్ రెడ్డి వీరి బాగోతాన్ని బయటపెట్టాడు.
స్మార్ట్‌ఫోన్, టెక్నాలజీ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టాయి కానీ, ఒక్కోసారి కుటుంబాల విచ్చిన్నానికి అవే కారణమవుతుండటం విషాదం. శంషాబాద్ ఘటనలో నాగరాజు భార్య, కానిస్టేబుల్ సందీప్‌కు పరిచయం ఫేస్‌బుక్‌లోనే. సునీతారెడ్డి, మల్లిఖార్జున్‌ల బంధం కూడా వాట్సాప్‌లోనే బలోపేతమైంది. సామాజిక మాధ్యమాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెట్టే సాధనాలుగా మారాయని, కొందరు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొన్న నాగర్ కర్నూల్‌లో స్వాతి భర్తను చంపేసింది. జ్యోతి కట్టుకున్నోని కడతేర్చింది. వివాహేతర బంధంతో మొగున్ని చంపేస్తున్నారు కొందరు భార్యలు. ఇంకొన్ని ఘటనల్లో భర్తలే నరహంతకులు. తప్పు ఎవరు చేసిన తప్పే. భార్యాభర్తల మధ్య నమ్మకం, నిజాయితీనే కుటుంబాన్ని, బంధాన్ని నిలబెడతాయి. అవి పతనమవుతుండటమే, ఇలాంటి ఘోరాలకు కారణమని విశ్లేషిస్తున్నారు సామాజికవేత్తలు.