రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. దీనిలో భాగంగానే గాంధీభవన్ లో అఫిస్ బేరర్లు సమావేశం జరిగింది. రానున్న 45రోజులు నేతలంతా సమిష్టిగా కష్టపడి పనిచేయాలని ఈ సమావేశంలో దిశానిర్థేశం చేసింది పీసీసీ. ఇక సీట్ల పొత్తుల్లో అవసరమైతే నేతలు త్యాగాలకు సిద్దపడాలని సూచించారు. పిసిసి స్థాయి నాయకులంతా ఇంటింటికి వెళ్లి ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవంబర్ ఒకటి నుంచి 7 వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్బంగా.. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించారు. ఈనెల 28న అధికార ప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించనున్నారు.
ప్రచారం చేసేందుకు మొత్తం నాలుగు టీంలను ఫాం చేయాలని ఆఫీస్ బేరర్ల సమావేశంలో చర్చించారు. ఈ టీమ్స్ వేర్వేరు దిశల్లో ప్రచారం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఒక్కో టీంకు ఒక్కో ముఖ్యనేత బాధ్యుడిగా ఉంటారు. వారే ప్రచార బాధ్యతలను కూడా చూసుకుంటారు. రాహుల్ మలివిడత తెలంగాణ టూర్, సోనియా టూర్ ల పై కూడా పిసిసి ఆఫీస్ బెరర్ల సమావేశంలో చర్చకు వచ్చింది. రాహుల్ సభలకు జనసమీకరణ, సభలు నిర్వహించే ప్రదేశాలు. సభలు ఎక్కడ నిర్వహించాలి అనే అంశాలపై కూడా చర్చించారు.
నవంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగుతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల ఫోన్లని సీఎం కేసీఆర్ ట్యాప్ చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మహాకూటమికి కామన్ ఎజెండాతో పాటు ఏపార్టీకి ఆ పార్టీ ఎజెండా ఉంటుందని ఉత్తమ్ చిట్ చాట్‌లో చెప్పారు. పిసిసి కార్యవర్గ సమావేశంలో.. ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై రెండుగంటలకు పైగా చర్చించారు. సమిష్టిగా కష్టపడితే పార్టీ అధికారంలోకి వస్తుందని నేతలు ధీమాను వ్యక్తం చేశారు.