దళపతులు, సేనాధిపతులు, వ్యూహకర్తలు, ట్రబుల్ షూటర్లు. ఇలా కాంగ్రెస్ అగ్రదళమంతా, తెలంగాణ రణక్షేత్రంలోకి అడుగుపెడుతోంది. గులాబీదండుపై తొడగొడుతోంది. ఒక్కొక్కరుగా వాలిపోతే, సైన్యంగా జట్టుకడుతూ, యుద్దరంగంలో అస్త్రాలు సంధించేందుకు సిద్దమవుతోంది.తెలంగాణ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడైన కాంగ్రెస్ హైమకమాండ్, అందుకు తగ్గట్టుగా మోహరిస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆరితేరిన అగ్రదళాన్నంతా రణక్షేత్రంలోకి పంపిస్తోంది.
బుజ్జగింపులు, ప్రచారవ్యూహాలకు ఇప్పటికే అతిరథ మహారథులు తెలంగాణలో ల్యాండయ్యారు. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌పటేల్, హైదరాబాద్‌కు వచ్చారు. రెబల్ జెండా ఎగరేసిన అసంతృప్తులను బుజ్జగించారు. శేరిలింగంపల్లిలో, రెబల్‌గా బరిలోకి దిగిన భిక్షపతి యాదవ్‌ను ఇంటికివెళ్లి మరీ, బుజ్జగించారు. నామినేషన్ ఉపసంహరించుకునేలా, భిక్షపతిను ఒప్పించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి కూడా బుజ్జగింపుల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రులు చిదంబరం, జైరాంరమేశ్ కూడా హైదరాబాద్‌కు విచ్చేశారు. చాలామంది రెబల్స్‌తో మాట్లాడి, దారికి తెచ్చారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌దే కీలకపాత్ర అని గుర్తుచేశారు. ఇంకా వివిధ బహిరంగ సభల్లో, పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ఎన్నికల పోరును వేడెక్కిస్తున్నారు.
ఇక దేశంలో ఏ రాష్ట్ర పీసీసీలోనైనా సంక్షోభం తలెత్తితే, అక్కడ వాలిపోయే కర్ణాటక మంత్రి డి.కె శివకుమార్ కూడా, ఇప్పటికే చాలా రోజుల నుంచి తెలంగాణలో తిష్టవేశారు. ప్రచార వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి బాధ్యతలుండాలో దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇక సినీ నటిగా సుపరిచితురాలైన, తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ కూడా రంగప్రవేశం చేశారు. కేసీీఆర్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంకా సీనియర్ నేత నారాయణ స్వామి, పృథ్వీరాజ్ చౌహాన్‌తో పాటు అనేకమంది కాంగ్రెస్ సీనియర్లు కదనరంగంలోకి అడుగుపెడుతున్నారు. మొత్తం కాంగ్రెస్ బలగమంతా, తెలంగాణ యుద్ధంలోకి దూకుతోంది. సోనియా సభతో శంఖారావం పూరించి, కాంగ్రెస్‌లో నూతనోత్తేజం తేవాలని, తర్వాత వివిధ నియోజకవర్గాల ప్రచార సభల్లో పాల్గొని, మహాకూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చూడాలి, కాంగ్రెస్ హేమాహేమీల రాక, ఎన్నికల్లో ఎలాంటి కాకరేపుతుందో.