స్టార్ క్యాంపెనర్ రాములమ్మ ఎక్కడా అన్నారు. తిరుగుబాటు హనుంతుడు ప్రచార భేరిలోకి దూకడం డౌటేనన్నారు. కొత్త కమిటీల కొట్లటాలకే కానీ, కలిసికట్టుగా గులాబీలతో కొట్లాడ్డంలేదే అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా ఒకే వేదికపైకి వస్తారా...అసలు ప్రచారాన్ని ప్రారంభిస్తారా అని విసుర్లు వినిపించాయి. వీటన్నింటికీ అలంపూర్ సభతో, కాంగ్రెస్ సమాధానమిచ్చిందా...ఇందూరు సభతో కూటమిపై బాంబులు పేల్చిన టీఆర్ఎస్‌పై, కత్తులు దూసేందుకు సిద్దమని కాంగ్రెస్ నేతలు సంకేతమిచ్చారు.
జోగులాంబ గద్వాల సాక్షిగా ఎన్నికల ప్రచార సమారాన్ని ప్రారంభించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఒకవైపు మహాకూటమి కసరత్తు సాగుతూనే, జోగులాంబ అమ్మవారు సాక్షిగా ఎన్నికల నగారా మోగించారు. కాంగ్రెస్‌కు కొత్త కమిటీలు ప్రకటించాక, ఒక్కసారిగా గాంధీభవన్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం బయటపడింది. ఎవరికి వారు అసంతృప్త నేతలు బాహాటంగా విమర్శించారు. పదవులపై అలిగారు. వి.హనుమంత రావు గాంధీభవన్ నుంచి ఆగ్రహంతో బయటికొచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శల బాణాలు కురిపించారు. ఇంకెందరో నేతలు కమిటీల కూర్పుపై లోలోపల రగిలిపోయారు. ఇక కాంగ్రెస్ నేతల్లో ఐక్యత సాధ్యంకాదన్న ఊహాగానాలు వినిపించాయి. బహుశా జనంలోకి ఇలాంటి అభిప్రాయం రావడం మంచిదికాదనుకున్నారేమో, కలిసికట్టుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. ఐక్యత లేదనడం కేవలం అపోహలేనన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేశారు. అలిగిన వీహెచ్ కూడా అలంపూర్ సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
స్టార్ క్యాంపెనర్‌గా నియమించకుముందు, నియమించిన తర్వాత కూడా ఫైర్ బ్రాండ్ విజయశాంతి కనిపించడం లేదన్న విమర్శలు పెరిగాయి. దీంతో అధిష్టాన పెద్దలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు కూడా, రాములమ్మను ఒప్పించారు. ఆ చర్చల ఫలితమే, జోగులాంబ గద్వాలలో రాములమ్మ ప్రత్యక్షం. కత్తులు దూయడం. కేసీఆర్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించడం. అటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకుడు జానారెడ్డి, డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ దీమా వ్యక్తం చేశారు. మహాకూటమిని చూసి, కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.
మొత్తానికి ఒకే వేదికపైకి కలిసికట్టుగా కనిపించి, తమ మధ్య విభేదాలున్నా, చీలికలు లేవని నిరూపించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల సమరంలో ఐక్యంగా పోరాడతామని అధిష్టానానికి సైతం సంకేతాలు పంపారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. త్వరలో మరిన్ని నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్ చేస్తున్నారు. సోనియాను సైతం రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.