తెలంగాణలో పురపాలక సంఘాల్లో అవిశ్వాస తీర్మానాలు ఊపందుకుంటున్నాయి. చైర్ పర్సన్ లపై అసంతృప్తి, ఎమ్మెల్యేలతో విభేదాలు, వ్యక్తిగత కారణాలు లాంటి ఎన్నో అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఇప్పటికే నాలుగు చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మరో నాలుగైదు చోట్ల నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదవీకాలం మరో ఏడాది మాత్రమే ఉన్నప్పటికీ, అవిశ్వాస తీర్మానాల జోరు మాత్రం తగ్గడం లేదు. అన్నిటి కంటే ముఖ్యంగా క్యాంపు రాజకీయాలు కూడా భారీగా మొదలయ్యాయి. మొత్తానికి ఈ వ్యవహారం జిల్లాల్లో తెరాసలో చిచ్చురేపేదిగా మారింది.
పురపాలక సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లపై నాలుగేళ్ళు గడిచిన తరువాతనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న నిబంధన ఉంది. ఇదే ఇన్నాళ్ళుగా వివిధ పురపాలక సంఘాల్లో అసంతృప్తి పెద్దగా బయటకు రాకుండా చూసింది. నాలుగేళ్ళు పూర్తి కావడంతో, అసంతృప్తి ఒక్కసారిగా ఎగిసిపడుతోంది. భువనగిరి, బెల్లంపల్లి, పరకాల, బోధన్ లలో చైర్ పర్సన్లపై ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చారు. కామారెడ్డి, ఆర్మూరు, జనగాం, పెద్ద అంబర్ పేట తదితర ప్రాంతాల్లో కూడా ఈ చిచ్చు రాజుకుంటోంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం మరొకటి కూడా ఉంది. ఉప్పు - నిప్పులా ఉండే పార్టీలకు చెందిన వారు కూడా అవిశ్వాస తీర్మానం దగ్గరకు వచ్చేసరికి ఒక్కటవుతున్నారు. క్యాంపు రాజకీయాలు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి.
అవిశ్వాస తీర్మానాల విషయంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి విషయం తెలంగాణ అంతటా చర్చనీయాంశంగా మారింది. అందరిదీ ఒకే నియోజకవర్గం అందరూ అధికార పార్టీ ప్రతినిధులే ఒక వైపున పట్టు నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే ఆశ మరో వైపున, అధికారం చేజిక్కించుకోవాలని కౌన్సిలర్ల పోరాటం. ఒకరిని మించి ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇక్కడ కౌన్సిలర్లు ఏకంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై, మున్సిపల్ చైర్ పర్సన్ పసుపుల సునీత రాణి పై తిరుగుబాటు జెండా ఎగురవేసి క్యాంప్ రాజకీయాలు నడిపిస్తున్నారు. మున్సిపల్ లో 34 వార్డులుండగా అందులో 26 మంది టిఆర్ ఎస్ కౌన్సిలర్లు. వారిలో 21 మంది చైర్ పర్సన్ పై అవిశ్వాసం ప్రకటించారు. టిడిపి, కాంగ్రెస్, సిపిఐ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటించిన వారి సంఖ్య 29 చేరింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చైర్ పర్సన్ అవిశ్వాసం వీగిపోవడానికి బెదిరింపులకు దిగడం వివాదం మారింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కౌన్సిలర్ల బంధువులకు ఫోన్ చేసి, క్యాంప్ రాజకీయాలు వీడి తిరిగి రావాలని హెచ్చరించారు. లేకుంటే తగిన శాస్తి చేస్తామని బెదిరించారు.
కౌన్సిలర్లు దిగిరాకపోతే భూకబ్జాలు, ఇతర కేసులు ఎగదోడుతామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హెచ్చరించారు కౌన్సిలర్ల రెబల్ గ్రూప్ మాత్రం, ఎమ్మెల్యే మద్దతు ఉన్నా చైర్ పర్సన్ ను గద్దె దించేదాకా వదిలేది లేదని క్యాంప్ కొనసాగిస్తున్నారు. తిరుగుబాటు కౌన్సిలర్లు ఏకంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై గురిపెట్టారు. అందులో బాగంగా ఎమ్మెల్యే ఫోన్ సంభాషణను బయటపెట్టారు. దాంతో ఎమ్మెల్యే పై తిరుగుబాటు కౌన్సిలర్లు ఆధిపత్యం సాధించారు. అయితే ఎమ్మెల్యే పాచికల ముందు కౌన్సిలర్లు చివరి వరకు అవిశ్వాసం క్యాంప్ కొనసాగిస్తారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. పలువురు తాడో పెడో తేల్చుకోవాలని పట్టుదలతో ఉండటంతో ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగింజడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైర్ పర్సన్ ను గద్దే దించితే తప్ప అవిశ్వాసం నుండి బయటకు వచ్చేది లేదని పలువురు కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మొత్తం మీద తెలంగాణలో ఈ అవిశ్వాస తీర్మానాలు ఎలాంటి రూపం తీసుకుంటాయో చూడాలి.