మూడక్షరాల సక్సెస్ మంత్రతో ఉద్యమ ధీరత్వంతో చాణక్య వ్యూహాలతో గెలుపు ఐకాన్‌గా యునిక్ లీడర్‌గా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తెలంగాణ సెకండ్ టైమ్ సీఎంగా ఎదిగారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన కేసీఆర్ సాగించిన ప్రస్థానం ఒక చరిత్ర. ఒక అధ్యాయం. చెరిగిపోని సంతకం. చింతమడక నుంచి చీఫ్ మినిస్టర్ దాకా సాగిన కేసీఆర్ ప్రయాణం ఎర్రవల్లితో మరింత ఎగిరింది. భావి తరాలకు ఒక పాఠమైంది.
64 ఏళ్ల వయస్సు.. 46 ఏళ్ల రాజకీయం 35 యేళ్లుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం13 ఏళ్ల ఉద్యమ నేపథ్యం. నాలుగున్నరేళ్ల ముఖ్యమంత్రి పీఠం.. బ్రీఫ్‌గా చెప్పాలంటే ఇంతే. అంకెల్లో అంతే. కానీ ఆయన ప్రస్థానం తెలుసుకోవాలంటే చరిత్ర... ఆయన గురించి చెప్పాలంటే అధ్యాయం అంటున్నారు ఎర్రవల్లి ప్రజలు. ఆరంభించరు నీచమానవుల్.. అంటూ సాగే పద్యాన్ని ఎప్పుడూ కంఠతా పలికే కేసీఆర్.. తన జీవితాన్ని అలాగే మలుచుకున్నారంటూ ఆకాశానికెత్తుతున్నారు. కోట్ల మంది కలలను సాకారం చేశాడంటూ భుజకీర్తులు పెడుతున్నారు. ఆ ఉద్విగ్న క్షణాలను హెచ్ఎంటీవీ తన కెమెరాలో బంధించింది. ఇప్పుడు ఎటు చూసినా కళకళలాడుతున్న ఎర్రవల్లి నాలుగున్నరేళ్ల క్రితం ఎలా ఉందో చూపించింది హెచ్‌ఎంటీవీ.
తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన కేసీఆర్ సొంతూరు చింతమడక. దత్తత తీసుకొని ప్రగతి పరుగులు పెట్టించిన గ్రామం ఎర్రవల్లి. కేసీఆర్ సీఎం అయ్యాక ఏ గ్రామం ఏమంటోంది? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కేసీఆర్ తెలంగాణ సీఎం అయినా.. ఆ ఊరి బిడ్డడే. అందుకే... కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఆ పల్లె ఆనందంతో పరవశిస్తోంది. రెండోసారి సీఎంగా అధికార పగ్గాలు చేపట్టనున్న తమ సొంత మనిషి గురించి చింతమడక గ్రామం గొప్పగా చెప్పుకుంటోంది.
కేసీఆర్ ప్రమాణస్వీకారోత్సవ వేళ ఆయన దత్తత గ్రామం అయిన ఎర్రవళ్లిలో పండుగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టిన సందర్భంగా.. ఎర్రవళ్లి వాసులు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని.. ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ సీఎంగా.. ప్రమాణస్వీకాం చేసే సమయం కోసం ఉదయం నుంచి ఎదురుచూసిన ఎర్రవెళ్లి వాసులు.. ముహూర్తానికి అరగంట ముందు నుంచే HMTV చూస్తూ గడిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని మొత్తం.. తర్వాత జరిగిన ఫోటో సేషన్‌ను కేసీఆర్ పండితులు ఆశీర్వదించిన ఘట్టాన్ని HMTVలో వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు.
ఎర్రవల్లి నాలుగున్నరేళ్ల ఈ పేరు ఎవరికీ తెలియదు... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అయ్యాక ఎర్రవల్లికి తెలంగాణలో ఓ గుర్తింపు వచ్చింది. అంతేకాదు కేసీఆర్ సీఎం అయ్యాక ఎర్రవల్లి అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇప్పుడు కేసీఆర్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టనున్న తరుణంలో ఎర్రవల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. కేసీఆర్‌కు ఎర్రవల్లితో సెంటిమెంట్ ఉందని స్థానికులు చెబుతున్నారు. చింతమడక చింతలేదని చెబుతోంది. ఎర్రవల్లి ఎగిరెగిరి పడుతుంది. రెండు గ్రామాలతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకున్న అనితర సాధ్యుడి అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించాయి ఆ రెండు గ్రామాలు. ఉద్విగ్నభరితంగా ఉన్న ఆ రెండు గ్రామాల్లో ఉదయం నుంచి హెచ్ఎంటీవీ అక్కడే మకాం వేసింది. వారి ఆనందాన్ని పంచుకుంది. ఉద్వేగాన్ని బంధించింది.