గులాబీ తెరపై బుజ్జగింపుల పర్వం పార్ట్ టు మొదలైంది. మొన్నటి వరకు కొందర్ని దారిలోకి తెచ్చిన అధినాయకత్వం, మాటవినని మిగతా నేతలనూ చల్లబరిచేందుకు సిద్దమైంది. త్వరలో ప్రకటించబోతున్న 12 స్థానాల్లో, ఆశావహులు, మిగతా నేతలనూ పిలిపించుకుని మాట్లాడబోతున్నారు కేసీఆర్.
ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దంచేసుకొని అసెంబ్లీని రద్దు చేశారు కెసీఆర్. వెనువెంటనే తెలంగాణ భవన్‌లో 107 మంది అభ్యర్ధులను ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో అభ్యర్ధులందరినీ ప్రచార రంగంలోకి దించారు. ఖరారైన నేతలంతా, ఎన్నికల క్షేత్రంలోకి దిగి క్యాంపెయిన్ ముమ్మరం చేశారు. అయితే ఒకటి రెండు చోట్ల తప్ప, సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించడంతో, టిక్కెట్ ఆశించిన నేతలు భంగపడ్డారు. దీంతో చాలామంది నేతలు మనస్తాపానికి గురయ్యారు. అయితే కొన్ని చోట్ల నేతలు సర్దుకుపోగా మరికొన్ని చోట్ల మాత్రం, ప్రచారంలో పాల్గొనకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహకరించకుండా సైలెంట్ అయ్యారు.
నియోజకవర్గాల్లో అసంతృప్తుల అలకలతో రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్, వారిని బుజ్జగించే బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. నియోజకవర్గాల వారీగా అసమ్మతి నేతలను పిలిపించుకొని అభ్యర్ధులకు సహకరించాలని కోరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎంసి కోటిరెడ్డి, నల్గొండలో దుబ్బాక నర్సింహరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం వర్గం నేతలను, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, డోర్నకల్ నుంచి సత్యవతి రాథోడ్, మధిర నుంచి బమ్మెర రామ్మూర్తి, సత్తుపల్లి నుంచి మట్టాదయానంద్, కల్వకుర్తి నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఉప్పల్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్, చెన్నూర్- నల్లాల ఓదెలు, నిర్మల్ - శ్రీహరిరావుతో పాటు పలువురు నేతలను హైదరాబాద్‌కు పిలిపించుకొని మరీ, వారిని బుజ్జగించారు కేటీఆర్. దీంతో వారంతా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులకు సహకరిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు.
అయినా కొన్ని నియోజవర్గాల్లో నేతలు మాత్రం అలకవీడటం లేదు. పాలకుర్తి నుంచి టిక్కెట్ ఆశించిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా పలువురు నేతలు ఇదే దారిలో ఉన్నారు. కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతారని పార్టీవర్గాలంటున్నాయి. మాజీ మంత్రి వినోద్ చెన్నూర్ టిక్కెట్ ఆశించారు. కాని ఆ సీటును ఎంపి బాల్క సుమన్ కు కేటాయించడంతో అలకబూనిన ఆయన, కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. దీంతో స్వయంగా కెసీఆర్ రంగంలోకి దిగారు. తనను కలవాల్సిందిగా వినోద్‌ను కోరారు. దీంతో ఆయన మెత్తబడ్డారని సమాచారం. ఇలా అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలను వన్ టూ వన్ పిలుపించుకొని మాట్లాడతారని తెలుస్తోంది.
ఇక మరోవైపు పన్నెండు మంది అభ్యర్ధులను త్వరలోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తి నేతలను ముందే పిలుపించుకొని సర్ది చెబుతున్నారని సమాచారం. టిక్కెట్లు ప్రకటించాక వారు ఎలాంటి ఆందోళనలు పార్టీ మారటాలు చేయకుండా వారికి నచ్చజెప్పుతారని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక, వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్సీలుగానో కార్పొరేషన్ పదవులు ఇస్తామనో చెప్పటం ద్వారా ప్రస్తుతానికి బుజ్జగిస్తారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మొత్తానికి ఒకేసారి మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ నామినేషన్ల వరకు పార్టీలో అసంతృప్తుల బెడద లేకుండా చూసేందుకు కసరత్తు చేస్తున్నారు.