టీడీపీ, కాంగ్రెస్ మధ్య వైరం చెరిగిపోనుందా? వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేయనున్నాయా? తెలుగుదేశం లీడర్లు వదులుతున్న లీకులు దేనికి సంకేతం? కాంగ్రెస్‌పై గతంలో ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు లేదని చంద్రబాబు ఎందుకన్నట్లు?. కర్నాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో సోనియా, రాహుల్‌తో వేదికను పంచుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరయ్యారా? దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర ఎలా ఉండబోతోంది?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది ఎన్నోసార్లు రుజువైంది. బద్ధ శత్రువులు ఒక్కటవడం మంచి మిత్రులు విరోధులుగా మారడం రాజకీయాల్లో సర్వ సాధారణం. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడిలాంటి సీన్ మరొకటి కనిపించబోతోంది. అసలు ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ఆవిర్భవించిందో అదే పార్టీతో వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
టీడీపీ ముఖ్యనేతలతో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై చర్చించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్సుందన్న బాబు టీటీడీపీతో పొత్తుకు పార్టీలు తహతహలాడుతున్నాయన్నారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తుపై నేరుగా మాట్లాడకపోయినా కాంగ్రెస్‌పై గతంలో ఉన్న వ్యతిరేకత లేదంటూ చంద్రబాబు పదేపదే అనడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయొచ్చనే ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయ్యింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ నేతలు బాహాటంగా ప్రకటించనప్పటికీ ఆ పార్టీతో కలిసేది లేదని మాత్రం తెగెసి చెప్పడం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఉభయ తారకంగా ఉండేలా పొత్తులు ఉంటే బాగుంటుందని మంత్రులు, నేతలు చంద్రబాబుకి సూచించారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రాభవం తగ్గుతుంటే అదే సమయంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత తగ్గిందంటూ చంద్రబాబుకి వివరించారు. పైగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తానంటోందని, దాంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పినట్లు లీకులు వదులుతున్నారు.
రాహుల్‌గాంధీ ఏపీలో ప్రత్యేక హోదా మీటింగ్ పెడితే తీవ్ర నిరసనలు తెలిపిన టీడీపీ ఇప్పుడు అదే పార్టీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు రాహుల్ ఆంధ్రాకి వస్తే తరిమికొట్టాలన్న తెలుగుదేశం నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌పై వ్యతిరేకత తగ్గిందంటూ లీకులివ్వడం అనుమానాలకు తావిస్తోంది.