ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. సీటొచ్చిందని స్వీట్లు పంచుకుంటున్నారు. విజయం తమదేనని దీమా వ్యక్తం చేస్తున్నారు. కండువాలు కప్పుకుని, మందీ మార్బలంతో వీధివీధి తిరుగుతూ, ఓట్లడుగుతున్నారు. ఆ ఇద్దరి ప్రచారాన్ని చూసి, జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్క నియోజకవర్గం, ఒక్క టికెట్, ఇద్దరు అభ్యర్థుల ప్రచారమేంటని విస్తుపోతున్నారు. చొప్పదండి గులాబీ పార్టీలో, చిత్ర విచిత్ర రాజకీయమిది. అవును, ఎక్కడైనా ప్రతిపక్షాల పార్టీలు, అధికార పార్టీ మధ్య కొనసాగే రాజకీయాలు రసవత్తరంగా కనపడుతుంటాయి. కాని చొప్పదండి నియోజకవర్గంలో మాత్రం అధికార టీఆర్ఎస్ లోనే ఎత్తులు పై ఎత్తులతో సాగుతున్న పాలిటిక్స్, కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తుంటే, సామాన్యులకు మత్రం ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నాయి..
చొప్పదండి రసవత్తర రాజకీయంపై మరింత లోతుకెళ్లితే, నియోజకర్గం తాజామాజీ ఎమ్మెల్యే బొడిగే శో్భకు, టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వకపోగా, ఇప్పటివరకు పూర్తిగా హోల్డ్ లో పెట్టింది. అయితే ఆఫ్ ద రికార్డ్ గా టికెట్ సుంకె రవిశంకర్ కే వస్తుందంటు చొప్పదండిలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బొడిగే శోభ, సుంకె రవిశంకర్ మధ్య పోటాపోటి రాజకీయాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఒకే గొడుగు కింద నడిచిన చొప్పదండి టీఆర్ఎస్, ఇప్పుడు రెండు గ్రూపులు గా విడిపోయిది. నియోజకవర్గంలో టీఆర్ఎస్, కీలక నాయకులు అంతా బొడిగే శోభను కాదని.,సుంకె రవిశంకర్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రతిజ్తలు చేస్తున్నారు.
మరోవైపు బొడిగె శోభ వర్గానికి సంబందించిన కార్యకర్తలు ఏకంగా జిల్లాకు చెందిన మంత్రి ఈటెల రాజెందర్.,ఎంపిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి. తమ మహిళా నేతకే టికెట్ ఇవ్వబోతున్నందుకు కృతజ్ణతలు అంటూ ధన్యవాదాలు తెలిపారు. తమ నాయకురాలికి టికెట్ వచ్చేలా చేయాలంటూ స్దానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇటు సుంకె రవిశంకర్ వర్గీయులు కూడా మరో అడుగు ముందుకు వేసి, పార్టీ ప్రచారంలో దూకుడు పెంచేశారు. ప్రచార సామాగ్రీ కూడా సుంకె రవిశంకర్ కే అధిష్టానం పంపిందని, టెకెట్ కూడా వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీలోని కార్యకర్తలు., నాయకులే కాదు.. స్దానిక సంస్దల ప్రజాప్రతినిధుల్లోని జంటలు కూడా ఇప్పుడు విడిపోయాయి. భార్యలేమో బొడిగే శోభకు టికెట్ ఇవ్వాలని ప్రెస్ మీట్ పెడితే, భర్తలేమో సుంకె రవిశంకర్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి వచ్చినా తమకు ప్రాబ్లం కాకూడదని, భార్యాభర్తలు చెరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు రవిశంకర్ ప్రచారాన్ని హోరెత్తిస్తుండటంతో, బొడిగే శోభ కూడా మరో అడుగేశారు. అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని మీడియాతో చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు చేస్తున్న మరో వర్గం ప్రచారాన్ని ఖండించారు.
మొత్తానికి చొప్పదండి టికెట్ కన్‌ఫాం కాకపోవడంతో, బొడిగే శోభ, రవిశంకర్ వర్గం ఎవరికివారే ప్రచారం చేసుకుంటున్నారు. అధికారిక ప్రకటన తమకు అనుకూలంగా వచ్చేలా, బలప్రదర్శనలు, ప్రతిష్టలు, పూజలు, ప్రచారాలు, ప్రెస్‌మీట్లు పెడుతూ, అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆరాటపడుతున్నారు. ఎవరిస్టైల్లో వారు పని కానిచ్చేస్తున్నారు. సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు. వాట్పాప్, ఫేస్‌బుక్‌లలో పోటాపోటిగా ఒకరిమీద ఒకరు పోస్టులు పెట్టుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ జెండాను నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం ఏ వైపు ఉండాలో తెలియక, అయోమయంలో ఉండిపోయారు. చూడాలి చొప్పదండి చిత్రవిచిత్రానికి శుభం కార్డు ఎలా పడుతుందో...