తెలంగాణలో అన్ని నియోజవర్గాలది ఒకదారి అయితే చొప్పదండి మాత్రం మరోదారి..ప్రతిచోట టిఆర్‌ఎస్ ప్రచారం ప్రారంభించి దూసుకుపోతుంటే..ఇక్కడ మాత్రం టికెట్ కేటాయించకపోవడంతో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. టికెట్లపై క్లారిటీ లేక కాంగ్రెస్‌లోనూ కాక రేగుతోంది. అయితే ఆశావహులంతా ఎవరికివారే ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. చొప్పదండి నియోజవర్గంలో రాజకీయ పరిస్దితులపై స్పెషల్ స్టోరి.
మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న బొడిగే శోభకే టికెట్ వస్తుందని ఆశించినప్పటికి, కొన్ని కారణాల వల్ల హోల్డ్ లో పెట్టామంటూ, పార్టీ ప్రకటించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిగతా నియోజవర్గాలది ఒకదారి, చొప్పదండి ఒకదారి అన్నట్టు తయారైయ్యింది పరిస్దితి. అభ్యర్థిని ఫైనల్ చేయకపోవడంతో, ఎవరికివారే ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంచి రోజులు చూసుకుని ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామగ్రామాలు తిరుగుతూ, తమకు అనుకూలంగా ఓట్లు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఏకగ్రీవ తీర్మానాలు, కుల సంఘాలతో సమావేశాలు, ఇలా ఎవరి స్టైల్లో వారు ప్రచారం కానిచ్చేస్తున్నారు.
అయితే చొప్పదండిలో మాత్రం టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల్లో గ్రూప్ పాలిటిక్స్ కనపడుతున్నాయి. ఆ పార్టీ తాజామాజీ ఎమ్మెల్యే బొడిగే శోభకు టికెట్ ఇవ్వాలంటూ, కొందరు మాజీ సర్పంచ్ లు సమావేశం పెట్టుకుంటే..అదే సమయానికి టిఆరెఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ కు టికెట్ ఇవ్వాలంటూ మరికొందరు పోటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా చొప్పదండిలో రెండుగా విడిపోయిన టిఆర్ఎస్ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. బొడిగె శోభ వర్గం, ఆమెకు అనుకూలంగా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇక సుంకె రవిశంకర్ కూడా టికెట్ తనకు కచ్చితంగా వస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు.
మరోవైపు టిఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఓ క్లారీటితోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్దితుల్లో కాంగ్రెస్ నుంచి, టిఆర్‌ఎఎస్ గూటికి చేరేందుకు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పటికే కేటీఆర్‌తో మాట్లాడిన సుద్దాల దేవయ్య, హస్తం వీడి, కారెక్కేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. అయితే సుద్దాల దేవయ్యకు టికెట్ వస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు మాజీ మంత్రి, వినోద్‌ను చొప్పదండి నుంచి పోటిచేయించేందుకు టిఆర్ఎస్ అదిష్టానం మోగ్గుచూపుతున్నట్టుగా మరో వార్త వినిపిస్తోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా టీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుద్దాల దేవయ్య, వినోద్‌కు అనుకూలంగా ఉండాలని, సంకేతాలు పంపింది టీఆర్ఎస్ హైకమాడ్. వినోద్ కూడా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇటు కాంగ్రెస్‌లో కూడా అదే సస్పెన్స్. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా కాంగ్రెస్ నుంచి, చొప్పదండి టికెట్ కోసం నలుగురు కాంగ్రెస్ నాయకులు తీవ్రాతితీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. NSUI నుంచి మొదలు ఇప్పటివరకు పనిచేస్తున్న బండ శంకర్ ఒకవైపు, రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోకి వచ్చిన మేడిపల్లి సత్యం మరోవైపు...ఇక గజ్జెలకాంతం..నాగి శేఖర్ ఇలా చాలామంది చొప్పదండి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక చొప్పదండి నియోజవర్గంలో బిజెపి పెద్దగా యాక్టివ్‌గా, లేకపోవడంతో ప్రధాన పోటి టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉండబోతుంది. అయితే ఈ రెండు పార్టీల్లోను అభ్యర్థులపై ఓ క్లారీటి లేదు. దీంతో ఎవరికి వారు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరి ఎవరికి దక్కుతుంది చొప్పదండి టికెట్...ఎవరి మధ్య బ్యాలెట్ వార్...?