ఆ నియోజకవర్గం...కాకలు తీరిన కాకా కుటుంబానికి కంచుకోట. కాకా రాజకీయ జీవితానికి పునాది వేసిన స్థానం. అక్కడ ప్రారంభించిన రాజకీయ జైత్రయాత్ర, వారసుల దాకా కొనసాగింది. అలాంటి కోటలో, కాకా సామ్రాజ్యానికి బీటలు పారుతోంది. అంతేకాదు, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతోంది. ఒకరి కోసం ఒకరికి గులాబీ ముళ్లు గుచ్చుకుందని బ్రదర్స్ రగిలిపోతున్నారు. ఆఖరి ప్రయత్నాలూ ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలో ఆరు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన రాజకీయ నాయకుడు, గడ్డ వెంకటస్వామి. ఆయన ప్రస్థానం మొదలైంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్‌లో.
చెన్నూర్ నియోజకవర్గం నుంచి 1957లో ఎమ్మెల్యేగా విజయం సాధించి, రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగారు వెంకటస్వామి. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఎన్నో పదవులు అలంకరించారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం కాక కుమారులకు కంచుకోటగా మారింది. వెంకట స్వామి పెద్ద కుమారుడు వినోద్, 2004 ఎన్నికలలో పోటిచేసి విజయం సాధించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికలలో నల్లాల ఓదేలు చేతిలో ఓడిపోయారు వినోద్. మళ్లీ 2014 ఎన్నికలలో రెండోసారి సైతం పరాజయం చవిచూశారు. అయితే రాజకీయ సమీకరణలలో భాగంగా వివేక్ బ్రదర్స్, కాంగ్రెస్ పార్టీ వీడి టిఆర్‌ఎస్ గూటికి చేరారు.
వినోద్, వివేక్ పార్టీ మారిన తర్వాత, చెన్నూర్ టికెట్ వినోద్‌కు, పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ వివేక్‌కు ఇస్తారని అందరూ భావించారు. ముందస్తు ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని వినోద్ సైతం అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా విప్ ఓదేలును కాదని ఎంపీ సుమన్‌కు టికెట్ కేటాయించారు కేసీఆర్. కాక నుంచి వినోద్ వరకు పట్టున్న నియోజకవర్గంలో, కాక వారసులకు నిరాశ ఎదురైంది. మాజీ మంత్రి వినోద్, తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తమ్ముడు వివేక్‌కు టికెట్ గ్యారంటి చేసి, పార్టీ పెద్దలు తనను అవమానించారని వినోద్, తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ ఎన్నికలలో పోటీ చేయకపోతే తన రాజకీయ భవిష్యత్ ముగిసినట్టేనని కలత చెందుతున్నారు వినోద్.
అయితే అన్న వినోద్‌కు టికెట్ కేటాయించని పార్టీ, తమ్ముడు వివేక్ కోసం పెద్దపల్లి ఎంపీగా పోటిచేయడానికి ఎంపి సుమన్‌కు, చెన్నూర్ కట్టబెట్టింది గులాబీ పార్టీ. కావాలనే పార్టీ తనను పక్కన పెట్టిందని, అయినా తమ్ముడు వివేక్ పట్టించుకోవడంలేదని, వినోద్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వినోద్ తన అనుచరులతో గోదావరిఖనిలో సమావేశం నిర్వహించారు. దాంతో తనదారి తాను చూసుకోవడానికి సిద్దమైనట్టు ప్రచారం జరిగింది. చెన్నూర్ హామీ లభిస్తే, తిరిగి కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం సాగుతోంది.
ఇద్దరు అన్నదమ్ముల మధ్య టికెట్ విషయంపై విభేధాలు తారాస్థాయికి చేరాయి. తనకు టికెట్ వచ్చేలా ఒత్తిడి చేయాలని వినోద్, తమ్ముడు వివేక్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అన్న ఒత్తిడి మేరకు ఎంపి సుమన్‌ను చెన్నూర్ నుంచి మార్చాలని, వివేక్ బ్రదర్స్, మంత్రి కేటిఆర్‌ను కలిసి కోరారు. దానికి కేటిఆర్ సమ్మతించలేదు. అవసరమైతే పెద్దపల్లి ఎంపి టికెట్ సుమన్‌కే మళ్లీ ఇచ్చి..చెన్నూర్ టికెట్ అన్న వినోద్‌కు ఇవ్వాలని, వివేక్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారని, జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలా వరుస పరిణామాలతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయన్న ప్రచారం సాగుతోంది.
మరోవైపు వినోద్‌కు టికెట్ కేటాయించకపోవడంతో, కాక అభిమానులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీనియర్ కార్యకర్తలు, నాయకులు, ఎంపీ సుమన్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆదిలాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజరెడ్డి, సుమన్‌కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నా, ప్రచారంలో పాల్గొనడంలేదు. మూలరాజరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. అదే విషయాన్ని సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. అటు టికెట్ కేటాయించకపోవడంతో, పార్టీ మారాలని కార్యకర్తలు వినోద్‌పై తీవ్ర ఓత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే వినోద్‌కు టికెట్ దక్కుతుందని, అన్యాయం జరిగిన పార్టీలో ఉండి, పరువు కోల్పోయోకన్నా, పార్టీ మారడం మంచిదని వినోద్‌కు సన్నిహితులు సూచిస్తున్నారు.
అయితే ఒకవేళ పార్టీ మారితే మాజీ ఎంపి వివేక్, వినోద్ కలిసి కాంగ్రెస్‌లో చేరుతారని మంచిర్యాల జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటమే అందుకు నిదర్శనమని, పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే వినోద్, వివేక్‌లు పార్టీ మారతారన్న ప్రచారమంతా ఒట్టిదేనని టీఆర్ఎస్ నేతలంటున్నారు. వినోద్‌కు టికెట్ కేటాయించకపోయినా, ఆయనకు పార్టీ న్యాయం చేస్తుందని పార్టీవర్గాలు అంటున్నాయి. ఏ ముహూర్తాన చెన్నూర్ టికెట్ బాల్క సుమన్‌కు కేటాయించారేమో కానీ, అటు ఓదేలు వర్గం, ఇటు కాక వర్గం రగిలిపోతోంది. ఇప్పటికే ఓదేలు అనుచరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు వివేక్ బ్రదర్స్ నడుమ విభేదాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో, చెన్నూర్ రాజకీయం ఇంకెంత వేడెక్కుతుందో చూడాలి.