చెన్నై సూపర్ కింగ్స్ ...ఐపీఎల్ కింగ్‌గా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది. హైదరాబాద్ పై ...చెన్నై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు 20 కోట్ల నజరానా దక్కగా.. రన్నరప్ హైదరాబాద్ టీమ్‌కు పన్నెండున్నర కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో మెరుపులు మెరిపించిన చైన్స్ ఆటగాడు వాట్సన్ ...మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ ఛాంపియన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. రెండు సంవత్సరాల నిషేధం తర్వాత ఈ సీజన్‌తో బరిలోకి దిగిన చెన్నై జట్టు... అన్ని విభాగాల్లో అత్యద్భుత ప్రదర్శనతో ట్రోఫీని దక్కించుకుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 178పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 47 పరుగులు..యూసఫ్ పఠాన్ 45 రన్స్ చేయడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్ షేన్ వాట్సన్ 57 బంతుల్లో 117 పరుగులు చేసి..మరో 9బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ఐపీఎల్‌లో వాట్సన్‌కు ఇది రెండో సెంచరీ.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై టీమ్ 16 పరుగుల వద్ద డుప్లెసిస్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో వాట్సన్-రైనాల జోడి..ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించింది. పవర్ ప్లే వరకూ ఆచితూచి ఆడిన వీరిద్దరూ తర్వాత రెచ్చిపోయారు. ముఖ్యంగా వాట్సన్ బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వాట్సన్.. మరో 18 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వాట్సన్ ..సందీప్ శర్మ వేసిన 13 ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగుల్ని పిండుకున్నాడు. దాంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇదే ఊపును కొనసాగించిన వాట్సన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివర్లో సన్‌రైజర్స్ బౌలర్లు చెన్నైని కట్టిడి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. విన్నింగ్ షాట్‌ను అంబటి రాయుడు బౌండరీతో ముగించడంతో చెన్నై శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. 18.3 ఓవర్లలో 181 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
ధోనీ సారథ్యంలోని చెన్నై ఫ్రాంచైజీకి ఇది మూడో ఐపీఎల్ టైటిల్. ఐపీఎల్ విజేతగా నిలచిన చెన్నై సూపర్ కింగ్స్ కు 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రిన్నరప్ గా నిలచిన హైదరాబాద్ టీమ్ కు పన్నెండున్నర కోట్ల రూపాయల బహుమతి లభించింది. ఫైనల్ మ్యాచ్ లో సెంచరీతో మెరుపులు మెరిపించిన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్...మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.