సర్వేలు... సత్యాలు... డిసెంబరు 11న నిజాలు

Update: 2018-12-08 04:17 GMT

శాసనసభ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం తప్పదని, జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్‌ పోల్స్ తేల్చేశాయి. కేసీఆర్‌కు జనం బ్రహ్మరథం పట్టారని అంచనా వేశాయి. దాదాపు అన్ని జాతీయ ఛానెల్స్‌, కేసీఆర్‌ గెలుపు ఖాయమని తేల్చేయగా, ఒక్క రిపబ్లిక్‌ టీవీ మాత్రం హోరాహోరి తప్పదని లెక్కకట్టింది. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తును జనం తిరస్కరించారని, కేసీఆర్ పథకాలు కొనసాగాలని, మెజారిటీ జనం గులాబీ పార్టీకే ఓట్లేశారని ఛానెల్స్ విశ్లేషించాయి. ఏ ఛానెల్‌, ఏ పార్టీకి ఎన్ని సీట్లిచ్చిందో ఒక్కసారి చూద్దాం....

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌‌ పోల్‌, తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టింది. టీఆర్ఎస్‌కు 66 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమికి కేవలం 37 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. బీజేపీ గతం కంటే రెండు స్థానాలు పెంచుకుని, ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందని, అలాగే ఎంఐఎం, సహా ఇతర ఇండిపెండెట్లు 9 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది టైమ్స్‌ నౌ. ఇక దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌లో ఒకటైన న్యూస్‌ 18 ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ, కారు పార్టీ దూసుకుపోయింది. 50 నుంచి 65 స్థానాలు వస్తాయని తెలిపింది. ప్రజాకూటమి 38-52 స్థానాలకే పరిమితమవుతుందని లెక్కకట్టింది. బీజేపీకి 4-7 సీట్లు, అలాగే ఎంఐఎం సహా స్వతంత్రులు 8 నుంచి 14 సీట్లు గెలుస్తారని ఎగ్జిట్‌పోల్స్‌లో అంచనా వేసింది న్యూస్‌ 18.

ఇక ఇండియా టుడే, టీఆర్ఎస్‌కు పట్టాభిషేకం చేసింది. కనివిని ఎరుగని రీతిలో 79-91 వరకు కేసీఆర్‌ పార్టీకి సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌తో తేల్చింది. కాంగ్రెస్‌ కూటమికి, కేవలం 21-33 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 1-3 సీట్లు వస్తాయని తెలిపింది. ఎంఐఎం సహా ఇండిపెండెంట్లు 4-7 సీట్లలో గెలుపొందుతారని, తేల్చింది. కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుతో జతకట్టడం చారిత్రక తప్పిదంగా జనం భావించి, కూటమిని తిరస్కరించారని తెలిపింది. చంద్రబాబు లక్ష్యంగా, కేసీఆర్‌ సంధించిన వ్యూహాత్మక అస్త్రం ఫలించిందని భావించింది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలకు జనం జేజేలు కొట్టారని అభిప్రాయపడింది. ఇండియా టుడే ఓట్‌ షేర్‌ విషయానికి వస్తే, టీఆర్ఎస్‌కు 46 శాతం ఓట్లు పడతాయని తెలిపింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వచ్చిన ఓట్ల శాతం 34.3తో పోల్చితే దాదాపు 12 శాతం పెరిగినట్టే. కాంగ్రెస్‌ కూటమికి 37 శాతం ఓట్లు పెరుగుతాయని, ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌లో తేలింది. 2014లో కాంగ్రెస్‌కు మాత్రమే 25 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి ఈ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు కొల్లగొడుతుందని అభిప్రాయపడింది ఇండియా టుడే. 2014 ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 7.1. ఇక ఎంఐఎంకు కేవలం మూడు శాతం ఓట్లే పడతాయట. 2014లో ఎంఐఎం ఓట్ల శాతం 3.8. దానితో పోల్చితే, ఎంఐఎంకు 0.8 శాతం తగ్గినట్టే. అయితే, ఈ ఓట్లు టీఆర్ఎస్‌కు మళ్లాయనుకోవాలి. చిన్నాచితక పార్టీలు, స్వతంత్రులకు ఏడు శాతం ఓట్లు పడతాయని, ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్‌లో తేలింది.

ఇక ఆర్నవ్‌ గోస్వామి నేతృత్వంలోని రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌పోల్‌ డిఫరెంట్‌గా ఉంది. ప్రజాకూటమి, టీఆర్ఎస్‌కు చాలా టఫ్‌ ఫిగర్స్‌ ఇచ్చింది. టీఆర్‌ఎస్‌కు 48-60 వస్తాయని అంచనా వేసిన రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌ పోల్స్, అదే సమయంలో కాంగ్రెస్‌ కూటమి 46-59 స్థానాల్లో గెలుపొందుతుందని లెక్క కట్టింది. అంటే టగ్‌ ఆఫ్‌ వార్ తప్పదని భావించింది. బీజేపీకి ఐదు సీట్లు ఖాయమని అనుకుంటోంది. ఎంఐఎం సహా ఇండిపెండెంట్లు 13 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. మొత్తానికి అత్యధిక జాతీయ ఛానెళ్లు తెలంగాణలో టీఆర్ఎస్‌కే పట్టాభిషేకం చేశాయి. కేసీఆర్‌ ప్రభంజనం తప్పదని ఢంకా బజాయిస్తున్నాయి. ప్రజాకూటమికి ఓటమి తప్పదని అంచనా వేశాయి. ఒక్క రిపబ్లిక్‌ ఛానెల్‌ మాత్రమే, పోటాపోటీ తప్పదన్నట్టుగా అంచనా వేసింది. ఈ ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలతో టీఆర్ఎస్‌ శ్రేణులు సంబరపడుతుండగా, కాంగ్రెస్‌ కూటమి శ్రేణులు మాత్రం గుంభనంగా మారిపోయాయి. అయితే, గత చరిత్రను తీసుకుంటే ఎగ్జిట్‌పోల్స్‌ చాలా మటుకు తలకిందులైన ఉదంతాలే ఎక్కువ. అత్యధిక ఛానెల్స్‌ అంచనాలు తప్పాయి. అందుకే ఈవీఎంలో నిక్షిప్తమైన తీర్పే అసలైన తీర్పు. డిసెంబర్‌ 11న ఈవీఎం గుప్పిట విప్పుతుంది. సిసలైన పీపుల్స్‌ జడ్జిమెంట్‌ వెల్లడిస్తుంది. చూడాలి, జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్‌పోల్స్‌ నిజమవుతాయా....గతం మాదిరే తప్పుతాయో...లెట్స్ వెయిట్‌ టిల్‌ డిసెంబర్ లెవన్.

Similar News